ప్రాజెక్ట్ రాహుల్..! | Congress is trying to boost Rahul Gandhi image thru Media Publicity | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్ రాహుల్..!

Published Sat, Jan 11 2014 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

ప్రాజెక్ట్ రాహుల్..! - Sakshi

ప్రాజెక్ట్ రాహుల్..!

  • సరికొత్త ఇమేజ్ కోసం 500 కోట్ల ఖర్చు!
  •   రంగంలోకి విదేశీ యాడ్, పీఆర్ సంస్థలు
  •   రాహుల్‌ని ‘ఆమ్ ఆద్మీ’గా చూపడమే లక్ష్యం
  •   వచ్చేనెల నుంచి ప్రసారం కానున్న ప్రచార చిత్రాలు!
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సరికొత్త ఇమేజ్‌ని సృష్టించడం.. దేశంలోని యువత, సామాన్యులకు ఆయనను దగ్గర చేయడం లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ ‘ప్రాజెక్ట్ రాహుల్‌గాంధీ’ని ప్రారంభించింది. పార్టీలోని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. రాహుల్‌గాంధీని దేశ భవిష్యత్ తారగా, సామాన్యుల పాలిటి ఆపద్బాంధవుడిగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడం కోసం పార్టీ భారీగానే ఖర్చు చేస్తోంది. జపాన్ కేంద్రంగా పనిచేసే ప్రకటనలు, ప్రజాసంబంధాల(యాడ్, పీఆర్) కంపెనీ ‘డెంట్సూ’, న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా పీఆర్, కమ్యూనికేషన్ల సేవలు అందిస్తున్న ‘బర్సన్-మార్సలర్’ సంస్థల సేవలను ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. భారీస్థాయిలో దాదాపు రూ. 500 కోట్ల ఖర్చు కాగల ఈ ప్రాజెక్ట్‌ను రాహుల్‌గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. వచ్చే నెల నుంచి ప్రింట్, డిజిటల్, టీవీ మాధ్యమాల్లో రాహుల్‌పై ప్రచారాన్ని హోరెత్తించనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది. 
     
     ప్రకటనల బాధ్యత డెంట్సూది: రాహుల్ ఇమేజ్‌ని పెంచడానికి డెంట్సూ సంస్థ ప్రింట్, డిజిటల్, టీవీ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేందుకు ప్రకటనలను రూపొందిస్తుంది. ‘సామాన్యుడికి సాధికారత’ ప్రధానాంశంగా రాహుల్‌గాంధీని ఆమ్ ఆద్మీగా జనంలోకి తీసుకెళ్లే విధంగా ఈ ప్రకటనలుంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. డెంట్సూ ఇండియాతో కుదిరిన ఒప్పందం అమలు బాధ్యతను స్వయంగా రాహుల్ పర్యవేక్షిస్తున్నారని, ఆయన సన్నిహితులైన యువ నేతలు ముగ్గురు ఈ ప్రకటనల రూపకల్పనను దగ్గరుండి చూస్తున్నారని వెల్లడించాయి. ‘తనపై రూపొందించే ప్రకటనలు, లఘు చిత్రాల రూపకల్పనను రాహుల్ స్వయంగా చూసుకుంటున్నారు’ అని డెంట్సూ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేరు వెల్లడించవద్దన్న షరతుపై చెప్పినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే, ఈ వార్తాకథనాలపై స్పందించడానికి డెంట్సూ ఇండియా నిరాకరించింది.
     
     సోషల్ మీడియా బాధ్యత ‘బర్సన్-మార్సలర్’ది: మరోవైపు, ‘బర్సన్-మార్సలర్’ సంస్థ సోషల్ మీడియాపై దృష్టి సారిస్తుంది. ఒప్పందంలో భాగంగా రాహుల్‌గాంధీ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల పర్యవేక్షణ, అప్‌డేట్ బాధ్యతలను కూడా ఈ కంపెనీ పర్యవేక్షిస్తుంది. రాహుల్ పాల్గొనే ర్యాలీల ఫొటోలు, స్పీచ్‌ల ప్రధానాంశాలు, స్టేటస్ మెసేజ్‌లను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఆసక్తికర చర్చలు జరిగేలా చూడటం, ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా రాహుల్‌ని సాధ్యమైనంత మేరకు యువ ఓటర్లకు దగ్గర చేయడమే ఈ సంస్థ ప్రధాన బాధ్యతని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జెనెసిస్ బర్సన్-మార్సలర్, ఇండియా సంస్థ వ్యవస్థాపక సారథి ప్రేమా సాగర్ ఈ విషయమై స్పందిస్తూ, ‘ఇతర కమ్యూనికేషన్లు, రీసెర్చ్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్న కసరత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు సేవలు అందించడానికి బర్సన్-మార్సలర్‌కి బాధ్యతనిచ్చారని మేం ధ్రువీకరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
     
     రాహుల్‌కి ఆ అవసరం లేదు: కాంగ్రెస్
     రాహుల్‌గాంధీ ఇమేజ్‌ను పెంచడం కోసం విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆ అవసరం రాహుల్‌గాంధీకి లేదని స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement