ఏ అంటే ఆదర్శ్.. బీ అంటే బోఫోర్స్
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనేక కుంభకోణాలు వెలుగు చూశాయని, ఆ పార్టీ నాయకులు మాత్రం ఇతర పార్టీలను నిందించడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని మోడీ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం జగ్రవోన్లో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.
'కాంగ్రెస్ నాయకులు ఏబీసీడీలకు పరిభాష ప్రకరనం మార్చారు. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే బోఫోర్స్, సీ అంటే కోల్ స్కాంగా మారింది. మాకు అధికారం అప్పగిస్తే ప్రజాధనం దోపిడీ కాకుండా కాపాడుతాం. ఢిల్లీలో మంజూరు చేసే ప్రతి రుపాయిలో గ్రామాలకు 15 పైసలు మాత్రమే చేరుతోందని రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో చెప్పారు. భస్మాసుర హస్తం రుపాయిని స్వాహా చేస్తోంది' అని మోడీ అన్నారు. పంజాబ్, గుజరాత్ మధ్య సారూప్యత ఉందంటూ ఆ రాష్ట్ర ప్రజల మనసును గెలిచే ప్రయత్నం చేశారు. హిందువులు, సిక్కులు సోదరభావంతో జీవిస్తున్నారని, విభజించు పాలించు అన్న కాంగ్రెస్ కుట్ర ఇక్కడ పనిచేయలేదని అన్నారు. దేశం పారిశ్రామికం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాల్సిన అవసరముందని మోడీ చెప్పారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.