
చీరలు కాదు.. మిర్చి అమ్మండి
- కవిత, కేటీఆర్‌లపై జీవన్‌రెడ్డి సెటైర్స్
- రైతులకు న్యాయమైన ధర పోగా మిగిలింది మీరే తీసుకోండి
- టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏసీ రూముల్లో ఐస్‌క్రీమ్‌లు అమ్మినట్లే.. రైతులు కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన.. మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలపై సెటైర్లు విసిరారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు అమ్మి, కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారు. అదే మార్కెటింగ్ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలి. రైతులకు న్యాయమైన ధరను చెల్లించి, ఎక్కువ వచ్చిన డబ్బును టీఆర్‌ఎస్ సభలకే ఖర్చు పెట్టుకోవచ్చు’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంటలకి బోనస్ ఇచ్చామని, 1800 వున్న పత్తి విత్తనాల ధరను 800కి తగ్గించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిదేనని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి, ఆర్భాటాలకు తప్ప చెప్పినవి అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పక్కరాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులు పండించిన పంటకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల దృష్టి మళ్లించడానికే వచ్చే సంవత్సరం నుండి ఉచిత ఎరువులు అని సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని, ఊకపదంపుడు ఉపన్యాసాలతో ఫలితం శూన్యమని జీవన్ రెడ్డి అన్నారు.