ఆర్మీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ మండిపాటు!
న్యూఢిల్లీ: నూతన సైనికాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్మీ చీఫ్‌గా సీనియర్-మోస్ట్ అధికారులను నియమించే సంప్రదాయం ఉండగా.. దానిని ప్రభుత్వం ఎందుకు తోసిపుచ్చిందని ప్రశ్నించింది. లెఫ్టినెంట్ జనరల్ రావత్ నియామకం విషయంలో సీనియారిటీ సూత్రాన్ని ఎందుకు అనుసరించలేదని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించింది.
‘ఆర్మీ చీఫ్ నియమాకంలో సీనియారిటీని ఎందుకు గౌరవించలేదు. లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షి, లెఫ్టినెంట్ జనరల్ మహమెద్ అలీ హరిజ్‌ను ఎందుకు పక్కనపెట్టారు ప్రధానిగారు’ అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఈ నెల 31న రిటైరవుతున్న ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షీ అత్యంత సీనియర్ అధికారి. ఆయన తర్వాత సదరన్ ఆర్మీ కమాండర్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమెద్ హరిజ్ సీనియర్‌మోస్ట్ అధికారి.
నిజానికి సీనియారిటీలో రావత్ నాలుగోస్థానంలో ఉన్నారని, ఆయన కన్నా సెంట్రల్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ నేగి ముందు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్మీ అంతర్గత విషయాలపై స్పందించడానికి సాధారణంగా రాజకీయ పార్టీలు ముందుకురావు. కానీ, పెద్దనోట్ల రద్దుతో ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఆర్మీ చీఫ్ నియామకంలో కూడా విమర్శలకు దిగింది. గతంలో 1980లో ఇదే తరహాలో సీనియరిటీ ప్రకారం ముందున్న లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హాను పక్కనబెట్టి.. ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఏఎస్ వైద్యను నియమించారు.