ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు!
అఖిలేశ్‌పై ములాయం వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఉమ్మడి వెళుతున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ మాత్రమే లబ్ధి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. 'ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎలాంటి బలం లేదు. ఈ పొత్తు వల్ల ఆ పార్టీ పునరుత్తేజం పొంది కొన్ని స్థానాలు గెలుపొందవచ్చు. కానీ పోటీ మాత్రం ఎస్పీ-బీజేపీ మధ్యే ఉంటుంది' అని ఆయన స్పష్టం చేశారు.
2012 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనయుడు అఖిలేశ్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయడంపై తనకెలాంటి విచారం లేదని పేర్కొన్నారు. 'నిజానికి నేనే అఖిలేశ్‌ను ముఖ్యమంత్రిని చేశాను. నాకు తెలుసు అప్పుడు నేను చేయకుంటే.. అతను ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు' అని పేర్కొన్నారు. తమ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తుందన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. టికెట్ రాని కొందరు ఆగ్రహంతో ఉన్నారు తప్ప కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు.