‘ఏకీకృతం’పై కేంద్రంతో మాట్లాడతా | 'Consolidate' On Center With Speak | Sakshi
Sakshi News home page

‘ఏకీకృతం’పై కేంద్రంతో మాట్లాడతా

Published Thu, Oct 15 2015 3:02 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'Consolidate' On Center With Speak

హైదరాబాద్: సుప్రీంకోర్టు నిర్దేశికత్వానికి లోబడి తానే స్వయంగా వీలైనంత త్వరగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను సాధించుకునేందుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి ఈ నెల 31 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా దోమలగూడలోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో బుధవారం పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ జరిగింది.

ఇందులో కడియం మాట్లాడుతూ  ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి సమయం తీసుకుంటున్నాం తప్ప పరిష్కరించలేక కాదన్నారు. దేశంలోనే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకు లోతుగా ఆలోచించి అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు.

విద్యారంగం తెలంగాణలో అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, గత పాలకుల నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో విద్యారంగం నిర్వీర్యమై ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందు కోసం రూ.15 వందల కోట్లతో స్కూళ్లకు భవనాల నిర్మాణం చేయనున్నామన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద నియమితులైన కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం అవసరమైన గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నారు.

ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయనే అపవాదు ప్రభుత్వానికి రాకుండా 74 వందల మంది  వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుందన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే  ఉన్నప్పటికీ ఆ స్కూళ్ల పట్ల ప్రజల్లో నమ్మకం సడలుతోందన్నారు. ప్రభుత్వంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలన్నారు. అప్పుడే ప్రజల్లో నమ్మకం కల్గి విద్యార్థులు పాఠశాలలకు వస్తారన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ సత్ఫలితాలు సాధించాలన్నారు.

రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ టీచర్లు తలుచుకుంటే విద్యా విధానంలో విప్లవం వస్తుందన్నారు. ఏ వ్యక్తి ఎంత ఉన్నతస్థితికి చేరినా అందుకు టీచర్లే కారణమన్నారు. టీచర్లపై పోలీసులు నిఘా వేయలేరని, ప్రభుత్వం సరిగా పని చే స్తుందా లేదా అనే దానిపై టీచర్లు నిఘా పెట్టి ప్రభుత్వానికి సరైన మార్గదర్శనం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందనీ, లేదంటే వచ్చేది కాదన్నారు.

టీఆర్‌ఎస్‌కు హైకమాండ్ ఎవరూ లేరని, ప్రజలే హైకమాండనీ, వారి ఆదేశాలను పాటించి, పూర్తి చేస్తామన్నారు. వైద్యారోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ,పింఛనుదార్లకు ెహ ల్త్‌కార్డులతో ప్రభుత్వ, ప్రైవైట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో నగరంలోని 11 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యం లభించేలా చూస్తామన్నారు. పీఆర్‌టీయూ నేత, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ చేయనున్న  వెంకట్‌రెడ్డిని అతిథులు సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు జనార్ధన్, పూల రవీందర్, శ్రీనివాసులు నాయుడు, పుల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నరోత్తమరెడ్డి, ఏపీ ఆధ్యక్షుడు కమలాకర్, ప్రధానకార్యదర్శి భైరి అప్పారావు, పీఆర్‌టీయూ టిఎస్, ఏపీ పత్రికా సంపాదకులు నరహరి లక్ష్మారెడ్డి, కరుణానిధిమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement