unified service rules
-
ఆశలు అడియాసలే?
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ టీచర్లు 26 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం చేస్తున్న పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. టీచర్ల సంఘాలు, ప్రభుత్వాలు ఏకమైనా తమ వాదనను నెగ్గించుకోలేకపోయాయి. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టేయడంతో సుమారు 1.20 లక్షల మంది టీచర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం, టీచర్ల సంఘాలు సందిగ్ధంలో పడిపోయాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అనేకమార్లు ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా కోర్టుల్లో నిలువలేకపోయాయి. 1992 నుంచి అనేకసార్లు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా న్యాయ వివాదాలుగా మారిపోయాయి. అసలేం జరిగిందంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను 1971లో రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిగా విభజించారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్రతో ప్రభుత్వం జీవో నంబర్ 529ని జారీ చేసింది. విద్యా శాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే చేర్చింది. అప్పటికి పంచాయతీరాజ్ టీచర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. తర్వాత కాలంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా పరిషత్‌లు ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను నియమించుకున్నాయి. దీంతో 1990 నాటికి ఆ స్కూళ్లు, టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. తమను కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలని.. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం 1992లో జీవో నంబర్ 40ను జారీ చేసింది. న్యాయపరమైన ఆటంకాలతో ఆ జీవోను ప్రభుత్వమే విరమించుకుంది. దీంతో అది అమలుకు నోచుకోలేదు. 1998లో ఒకసారి, 2005లో మరోసారి.. ప్రభుత్వం 1998లో ఉమ్మడి సర్వీసు రూల్సు రూపొందించి జీవో 505ను, 538లను జారీ చేసింది. పంచాయతీరాజ్ టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లోక ల్ కేడర్ పరిధిలో లేనందున ఉమ్మడి సర్వీసు నిబంధనలకు వీల్లేదని ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ట్రిబ్యునల్ సమర్థించగా ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాకే ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లను కలపాలని హైకోర్టు ఉమ్మడి సర్వీసు నిబంధనలను 2003లో కొట్టేసింది. అప్పటి నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ వంటి పోస్టుల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం 2005 మేలో మళ్లీ ఏకీకృత సర్వీసు కోసం జీవో 95, 96లను జారీ చేసి పదోన్నతులు కల్పించింది. వాటి పై మళ్లీ ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌లో సవాల్ చేసి గెలిచారు. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 2007లో ‘రూల్స్’కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 2007లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనేక వాదనలు, వాయిదాల తరు వాత 2015 సెప్టెంబర్ 30న తీర్పు ఇచ్చింది. సుప్రీం ఏం చెప్పిందంటే.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్గనైజ్ అయి ఉన్న ప్రభుత్వ టీచర్లకు, ఆర్గనైజ్ కాని పంచాయతీరాజ్ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ‘ఉమ్మడి సర్వీసు రూల్స్ తీసుకురావాలంటే రాష్ట్ర పతి ఉత్తర్వులకు కేంద్రం ద్వారా సవరణ చేయించాలి. ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా పొందుపరచడం ద్వారానే ఒకే సర్వీసు రూల్స్ తీసుకురావడం సా«ధ్యం అవుతుంది. అప్పటి వరకు ఉమ్మడి రూల్స్ కుదరదు’అని పేర్కొంది. 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్ చేసేలా చర్యలు చేపట్టాలని కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫైలుపై 2016 ఏప్రిల్ 5న సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఆ తరు వాత దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ సమస్య ఏపీతోనూ ముడిపడి ఉన్నందున ఆ రాష్ట్రం కూడా ప్రతిపాదనలు పంపింది. తరువాత పలుమా ర్లు సంప్రదింపులు, చర్చల అనంతరం 2017 జూన్ 23న రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్లు 2017 జూలై 12న హైకోర్టులో కేసు వేశారు. తాజాగా మంగళవా రం రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అందువల్లే ఈ పరిస్థితి! రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి ముందే.. రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అభ్యంతరాలు ఉన్నాయా? అని రాష్ట్రపతి అడిగినపుడు అభ్యంతరాలు లేవని చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మామిడోజు వీరాచారి అన్నారు. ఏ దశలోనూ తమ వాదనను, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని చెప్పారు. న్యాయం తమవైపే ఉందని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. -
భలే చాన్సులే..
♦ రాష్ట్రపతి ఉత్తర్వులతో ‘ఏకీకృత’ ప్రయోజనం ♦ ఉపాధ్యాయులకు పదోన్నతులు ♦ స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలగాను.. ♦ సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగాను పదోన్నతి ♦ సీనియారిటీ ప్రాతిపదికన ప్రాధాన్యత సాక్షి, విశాఖపట్నం : ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులతో ఉపాధ్యాయులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగాను, స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు గాను పదోన్నతులు పొందడానికి మార్గం సుగమం కానుంది. విద్యాశాఖ ఇందుకవసరమైన సర్వీస్ రూల్స్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఉపాధ్యాయులకే తప్ప స్థానిక సంస్థల యాజమాన్యంలో నడిచే పాఠశాలల టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవు. రాష్ట్రపతి ఉత్తర్వులతో ఇకపై వీరికి కూడా సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. సర్వీస్ రూల్స్‌పై రూపొందించిన డ్రాఫ్ట్‌పై తమ అభ్యంతరాలను ఈ నెల తొమ్మిదో తేదీలోగా తెలియజేసేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయా ఉపాధ్యాయులను తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత విద్యాశాఖ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సీనియర్లకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లుగా పదోన్నతి కల్పిస్తారు. మరికొందరు ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతి పొందుతారు. కామన్ సీనియారిటీ ప్రకారం వీరికి ప్రమోషన్లు లభిస్తాయి. ఇందుకుగాను సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జోన్-1 పరిధిలోకి వస్తాయి. జోన్-1లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో సుమారు వెయ్యి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో విశాఖ జిల్లాకు సంబంధించి 450 వరకు ఖాళీలున్నాయి. నిబంధనల మేరకు వీటిని 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే 300 మందికి పైగా లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డైట్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉందన్నమాట! ఇలా పదోన్నతి పొందే స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం రెండు ఇంక్రిమెంట్లను ఇవ్వనుంది. ఈ లెక్కన కనీసం ఒక్కొక్కరికి తమ బేసిక్‌పై జీతం రూ.ఐదారు వేలు అదనంగా పెరగనుంది. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సుమారు 300 మంది కాంట్రాక్టు విధానంలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆందోళనలూ చేస్తున్నారు. వీరిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి తెచ్చి వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడానికి కనీసం మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. -
‘ఏకీకృత సర్వీస్’కు న్యాయశాఖ ఆమోదం
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయ శాఖ ఆమోదించిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డితో కలసి వేణుగోపాలాచారి గురువారం కేంద్ర న్యాయశాఖ లెజిస్లేటివ్ కార్యదర్శి నారాయణ రాజుతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రా ల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సంబంధిత ఫైలును లెజిస్లే టివ్ కార్యదర్శి ఆమోదించి, కేంద్ర హోంశాఖ కు పంపినట్టు తెలిపారు. ఇది ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న 3లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ ఫైలు త్వర లోనే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందే అవకాశం ఉంద ని వారు వెల్లడించారు. ‘భగీరథ’కు బదలాయించండి... మిషన్ భగీరథ పనుల నిమిత్తం కొన్ని ప్రాం తాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు ఇవ్వాల్సిన అను మతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిద్ మాధవ్ దవేను వేణుగోపాలాచారి కోరారు. పైప్లైన్ల ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలా యించి అనుమతులు ఇవ్వాలన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తోనూ సమావేశమై కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయా లని, సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ కింద రావాల్సిన నిధులను విడు దల చేయాలని వేణుగోపాలాచారి కోరారు. -
‘ఏకీకృత’ రూల్స్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ నేతలు కేంద్ర హోం శాఖను కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణు గోపాలచారి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి గురువారం హోం శాఖ కార్యదర్శి దిలీప్ కుమార్‌ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ క్యాడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఆమో దానికి ఉత్తర్వులు పంపాలని కోరారు. సర్వీస్ రూల్స్ ప్రతిపాదనలు పరిశీల నలో ఉన్నాయని, కేంద్ర హోం మంత్రి ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతికి పంపుతామని దిలీప్ కుమార్ హామీనిచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు. -
‘ఏకీకృతం’పై కేంద్రంతో మాట్లాడతా
హైదరాబాద్: సుప్రీంకోర్టు నిర్దేశికత్వానికి లోబడి తానే స్వయంగా వీలైనంత త్వరగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను సాధించుకునేందుకు చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి ఈ నెల 31 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా దోమలగూడలోని పింగళి వెంకట్రామిరెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ జరిగింది. ఇందులో కడియం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి సమయం తీసుకుంటున్నాం తప్ప పరిష్కరించలేక కాదన్నారు. దేశంలోనే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకు లోతుగా ఆలోచించి అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. విద్యారంగం తెలంగాణలో అనేక సమస్యలు ఎదుర్కుంటోందని, గత పాలకుల నిర్వాకం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో విద్యారంగం నిర్వీర్యమై ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందు కోసం రూ.15 వందల కోట్లతో స్కూళ్లకు భవనాల నిర్మాణం చేయనున్నామన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద నియమితులైన కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం అవసరమైన గైడ్‌లైన్స్ ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయనే అపవాదు ప్రభుత్వానికి రాకుండా 74 వందల మంది వలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుందన్నారు. క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నప్పటికీ ఆ స్కూళ్ల పట్ల ప్రజల్లో నమ్మకం సడలుతోందన్నారు. ప్రభుత్వంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలన్నారు. అప్పుడే ప్రజల్లో నమ్మకం కల్గి విద్యార్థులు పాఠశాలలకు వస్తారన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ సత్ఫలితాలు సాధించాలన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ టీచర్లు తలుచుకుంటే విద్యా విధానంలో విప్లవం వస్తుందన్నారు. ఏ వ్యక్తి ఎంత ఉన్నతస్థితికి చేరినా అందుకు టీచర్లే కారణమన్నారు. టీచర్లపై పోలీసులు నిఘా వేయలేరని, ప్రభుత్వం సరిగా పని చే స్తుందా లేదా అనే దానిపై టీచర్లు నిఘా పెట్టి ప్రభుత్వానికి సరైన మార్గదర్శనం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందనీ, లేదంటే వచ్చేది కాదన్నారు. టీఆర్ఎస్కు హైకమాండ్ ఎవరూ లేరని, ప్రజలే హైకమాండనీ, వారి ఆదేశాలను పాటించి, పూర్తి చేస్తామన్నారు. వైద్యారోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ,పింఛనుదార్లకు ెహ ల్త్కార్డులతో ప్రభుత్వ, ప్రైవైట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో నగరంలోని 11 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యం లభించేలా చూస్తామన్నారు. పీఆర్టీయూ నేత, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేయనున్న వెంకట్‌రెడ్డిని అతిథులు సత్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు జనార్ధన్, పూల రవీందర్, శ్రీనివాసులు నాయుడు, పుల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నరోత్తమరెడ్డి, ఏపీ ఆధ్యక్షుడు కమలాకర్, ప్రధానకార్యదర్శి భైరి అప్పారావు, పీఆర్టీయూ టిఎస్, ఏపీ పత్రికా సంపాదకులు నరహరి లక్ష్మారెడ్డి, కరుణానిధిమూర్తి పాల్గొన్నారు. -
పీఠాలు కదలాల్సిందే..!
⇒ యూనిఫైడ్ సర్వీసు రూల్స్ అమలుకు సర్కార్ కసరత్తు ⇒ మంత్రి తుమ్మల అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ⇒ అర్బన్ డెవలప్మెంట్లోని వివిధ యాక్టుల సవరణకు నిర్ణయం ⇒ హెచ్ఎండీఏలో త్వరలో ఉద్యోగుల స్థానభ్రంశం సాక్షి, సిటీబ్యూరో : మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని వివిధ శాఖలను ఒకే గొడుకు కిందకు తెస్తూ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను అమలోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవరించాలని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గతంలో ఉన్న యాక్ట్‌లనే అనుసరిస్తుండటం వల్ల హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో పాతుకుపోయిన ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా విభాగాల్లో పాతుకుపోయిన అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాల్లోని కిందస్థాయి నుంచి అధికారుల వరకు బదిలీ చేసినా ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మార్చడం మినహా ఇతర విభాగాలకు పంపలేని పరిస్థితి. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనూ నగరం విడిచి వేరే ఊరికి బదిలీ అయ్యేది లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. కొత్తగా యాదగిరిగుట్ట, గజ్వేలు పట్టణాలను డెవలప్మెంట్ అథార్టీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని అన్ని శాఖల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ (2008యాక్ట్), జీహెచ్ఎంసీ (2007 యాక్ట్), ఏపీ అర్బన్ డెవలప్మెంట్ (1975) యాక్ట్, ఏపీ టౌన్ ప్లాన్నింగ్ (1920) యాక్ట్, ఏపీ మున్సిపల్ (1964) యాక్టులను సవరించాలని సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల మిడిల్, హయ్యర్ అధికారుల పరస్పర బదిలీలకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర అధ్యక్షతన యూనిఫైడ్ సర్వీసుల కమిటీ ఏర్పాటు చేయడమేగాక, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవ రణకు సంబంధించి డ్రాఫ్టు బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీనికి ఓ రూపం వచ్చాక ‘లా’ విభాగానికి పంపి, అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదంతో అసెంబ్లీలో పెడతారు. అక్కడ ఆమోదం పొందితే చట్టం అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వీలైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చకు పెట్టాలన్న ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే... ఇందులో సాంకేతికంగా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది. కదలనున్న పీఠాలు ప్రభుత్వం ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమల్లోకి తెస్తే హెచ్ఎండీఏలో చాలా మంది ఉద్యోగుల పీఠాలు కదలనున్నాయి. ప్రధానంగా ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ చాలా సీరియస్‌గా ఉంది. గతంలో నీరబ్ కుమార్ కమిషనర్‌గా ఉన్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ఓ ఎమ్మెన్సీ కంపెనీ తమ సంస్థను నెలకొల్పేందుకు భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం బట్టబయలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సదరు కమిషనర్‌కు ఉద్వాసన పలికారు. అయితే... ఇందులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అధికారులపై నిఘా ఉంచినట్లు సమాచారం. హెచ్ఎండీఏ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ దాడులు జరగడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టింది. అయినా కొందరు అక్రమార్కులు తమ అక్రమ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో అక్రమార్కుల జాబితా భారీగానే ఉండటంతో వారందరినీ కట్టడి చేసేందుకు ఇతర విభాగాలకు బదిలీ చేయడం ఒక్కటే మార్గమని సర్కార్ భావిస్తోంది.