భలే చాన్సులే..
♦ రాష్ట్రపతి ఉత్తర్వులతో ‘ఏకీకృత’ ప్రయోజనం
♦ ఉపాధ్యాయులకు పదోన్నతులు
♦ స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలగాను..
♦ సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగాను పదోన్నతి
♦ సీనియారిటీ ప్రాతిపదికన ప్రాధాన్యత
సాక్షి, విశాఖపట్నం : ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులతో ఉపాధ్యాయులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగాను, స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు గాను పదోన్నతులు పొందడానికి మార్గం సుగమం కానుంది. విద్యాశాఖ ఇందుకవసరమైన సర్వీస్ రూల్స్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఉపాధ్యాయులకే తప్ప స్థానిక సంస్థల యాజమాన్యంలో నడిచే పాఠశాలల టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవు. రాష్ట్రపతి ఉత్తర్వులతో ఇకపై వీరికి కూడా సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. సర్వీస్ రూల్స్‌పై రూపొందించిన డ్రాఫ్ట్‌పై తమ అభ్యంతరాలను ఈ నెల తొమ్మిదో తేదీలోగా తెలియజేసేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయా ఉపాధ్యాయులను తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత విద్యాశాఖ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సీనియర్లకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లుగా పదోన్నతి కల్పిస్తారు. మరికొందరు ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతి పొందుతారు. కామన్ సీనియారిటీ ప్రకారం వీరికి ప్రమోషన్లు లభిస్తాయి. ఇందుకుగాను సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జోన్-1 పరిధిలోకి వస్తాయి. జోన్-1లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో సుమారు వెయ్యి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో విశాఖ జిల్లాకు సంబంధించి 450 వరకు ఖాళీలున్నాయి.
నిబంధనల మేరకు వీటిని 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే 300 మందికి పైగా లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డైట్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉందన్నమాట! ఇలా పదోన్నతి పొందే స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం రెండు ఇంక్రిమెంట్లను ఇవ్వనుంది. ఈ లెక్కన కనీసం ఒక్కొక్కరికి తమ బేసిక్‌పై జీతం రూ.ఐదారు వేలు అదనంగా పెరగనుంది. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సుమారు 300 మంది కాంట్రాక్టు విధానంలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు.
తమను పర్మినెంట్ చేయాలని ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆందోళనలూ చేస్తున్నారు. వీరిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి తెచ్చి వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడానికి కనీసం మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.