‘నాన్ డిటెన్షన్’నే కొనసాగించాలి | continue of Non-Detention | Sakshi
Sakshi News home page

‘నాన్ డిటెన్షన్’నే కొనసాగించాలి

Published Sun, Sep 13 2015 12:44 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

‘నాన్ డిటెన్షన్’నే కొనసాగించాలి - Sakshi

‘నాన్ డిటెన్షన్’నే కొనసాగించాలి

- పాఠశాల విద్యలో ప్రస్తుత పద్ధతివైపే సర్కారు మొగ్గు
- అఖిలపక్ష భేటీలో ఈ విధానానికే నేతల మద్దతు
- దీనిపై కేంద్రానికి సిఫారసు చేస్తాం: డిప్యూటీ సీఎం కడియం

సాక్షి, హైదరాబాద్:
పాఠశాల విద్యలో ప్రస్తుతం అమల్లో ఉన్న నాన్ డిటెన్షన్ విధానాన్ని కొనసాగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో విద్యాశాఖ శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీలన్నీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో సర్కారు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. ‘గతంలో డిటెన్షన్ విధానం ఉండగా 1971లో ఆ పాలసీని రద్దు చేశారు. అప్పటి నుంచి 7, 10 తరగతుల్లోనే బోర్డు పరీక్షల విధానం ఉండేది. 2008లో 7వ తరగతిలో బోర్డు పరీక్ష విధానాన్ని తొలగించారు. ప్రస్తుతం మళ్లీ డిటెన్షన్ విధానంపై కేంద్రం దృష్టి సారించి రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది.

అయితే రాష్ట్రంలో నాన్ డిటెన్షన్‌ను కొనసాగించాలన్నదే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం అయినందున మా అభిప్రాయం కూడా అదే. దీనిపై సీఎంతో చర్చించి నాన్ డిటెన్షన్‌నే కొనసాగించాలని కేంద్రానికి సిఫారసు చేస్తాం’ అని  కడియం పేర్కొన్నారు. పేద వర్గాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాన్ డిటెన్షన్ విధానం కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నామన్నారు. వార్షిక పరీక్షల మార్కులతో నిమిత్తం లేకుండా నిర్ణీత హాజరు శాతాన్నిబట్టి విద్యార్థులను ఎగువ తరగతులకు ప్రమోట్ చేయడమే నాన్ డిటెన్షన్ విధానమనేది తెలిసిందే.

అయితే దేశంలో నూతన విద్యా విధానంపై దృష్టి సారించిన కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యే విద్యార్థులను తిరిగి అదే తరగతి చదివేలా చేయడం)పై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఇటీవల డీఈవోలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్‌జీవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, ఉపాధ్యాయులతోనూ చర్చించింది.
 
అఖిలపక్ష భేటీలో ఎవరేమన్నారంటే...
డిటెన్షన్ విధానం తేవడం విద్యా హక్కును కాలరాయడమే అవుతుంది. ఇది అమల్లోకి వస్తే నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారు. -ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరిచేయాలి.
- జె.గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
 
డిటెన్షన్ విధానం వల్ల డ్రాపవుట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా విధానం మూస ధోరణిలో కాకుండా విద్యార్థుల ప్రతిభను గుర్తించేలా ఉండాలి. కనుక 7వ లేదా 8వ తరగతిలో బోర్డు పరీక్షా విధానం ఉండాలి.
- ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ

డిటెన్షన్ పద్ధతి సరైంది కాదు. పిల్లల సామర్థ్యాలు తగ్గకుండా నాన్‌డిటెన్షన్ విధానాన్ని అవలంబించాలి. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని పక్కాగా అమలు చేయాలి.
- సుధాకర్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ

నాన్ డిటెన్షన్ పద్ధతినే కొనసాగించాలి. డిటెన్షన్ విధానం వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫెయిల్ అవుతామేమోనన్న భయం ఏర్పడుతుంది.
- పెద్దిరెడ్డి, టీడీపీ నేత

డిటెన్షన్ విధానానికి మేం వ్యతిరేకం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే మరీ దారుణంగా తయారవుతుంది. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులకుగాను ప్రభుత్వ స్కూళ్లలో కేవలం 29 లక్షల మంది మాత్రమే ఉన్నారు. డిటెన్షన్ వల్ల పేద విద్యార్థుల డ్రాపవుట్స్ పెరుగుతాయి.
- కె.శివకుమార్, వైఎస్సార్‌సీపీ నేత

డిటెన్షన్ విధానానికి మేం వ్యతిరేకం. నాన్ డిటెన్షన్ విధానం వల్ల విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాలు అలవడుతాయి.
- పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ నేత

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేని నేపథ్యంలో డిటెన్షన్ విధానం సరైనది కాదు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టినట్లు ఉంది.
- చెరుపల్లి సీతారాములు, సీపీఎం నేత

విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రైవేటీకరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే డిటెన్షన్ విధానాన్ని తెరపైకి తెస్తోంది.
- ప్రభాకర్, ఎల్లన్న, బీఎస్పీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement