
కార్లకు ముకుతాడు!
- ట్రాఫిక్ నియంత్రణకు ఢిల్లీ బాటలో హైదరాబాద్
- కార్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
- ప్రణాళిక తయారీ బాధ్యత నిపుణులకు
- మరికొద్దిరోజుల్లో స్పష్టత
సాక్షి, హైదరాబాద్: మీకు కారుందా? ఆ కారులో నగరంలో రోజూ తిరుగుతున్నారా? మా కారు మా ఇష్టం అంటారా? అయితే ఇకపై రోజూ నగర రోడ్లపై మీ కారు పరుగులు తీసేందుకు కుదరకపోవచ్చు! వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాలుష్య భూతాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల సరి, బేసి సంఖ్య ఆధారంగా రోజువిడిచి రోజు మాత్రమే రోడ్లపైకి వచ్చేలా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించింది.
అసలే హైదరాబాద్‌లో ఇరుకురోడ్లు.. ఆపై లక్షల్లో వాహనాలు. నెల తిరిగేసరికి వేలసంఖ్యలో కొత్త కార్లు చేరుతున్నాయి. కాలుష్యాన్ని ఎగజిమ్ముతూ నగర జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. దేశంలో అత్యధికంగా కార్లు తిరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ముందు వరసలో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం వాటి నియంత్రణపై ఇప్పుడు దృష్టి సారించింది. కార్లకు ముకుతాడు వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇచ్చే బాధ్యతను నిపుణులకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఢిల్లీ తరహా సరి, బేసి సంఖ్యల ఆధారంగా నియంత్రణ కంటే... వారంలో నిర్ధారిత రోజుల్లో కార్ల వాడకాన్ని నియంత్రించే విధానం మెరుగ్గా ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఐదేళ్ల క్రితమే చొరవ
ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై దాదాపు 8.5 లక్షల కార్లు పరిగెడుతున్నాయి. నిత్యం 200 వరకు కార్లు కొత్తగా రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు అంతకంత అవుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్యాలయాల వేళల్లో చాలా కార్లలో ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. కనీసం క్రమశిక్షణ కూడా లేకపోవటంతో కార్ల వాడకం విచ్చలవిడిగా మారింది. దీన్ని అరికట్టేందుకు వాస్తవానికి 2010లోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ నాటి ప్రభుత్వం స్పందించకపోవటంతో అవి విఫలమయ్యాయి.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల ప్రాతినిధ్యంతో ఏర్పడ్డ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. నగరంలో ట్రాఫిక్ చిక్కులు, తద్వారా కాలుష్య సమస్య శ్రుతిమించకుండా ఉండాలంటే కార్లపై నియంత్రణ అవసరమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కార్లపై నియంత్రణ ఎలా ఉందో కూడా సూచించింది. అంతకుముందు నగరంలోని హైటెక్స్‌లో ‘పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా) సదస్సు జరిగిన సమయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగరంలో కార్ల వాడకంపై విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి పాటా సదస్సు జరగాల్సిన విదేశీ నగరాల ప్రతినిధులు ఈ విషయంలో చురకలు కూడా అంటించారు.
‘మా నగరంలో పాటా సదస్సుకు వచ్చేవారికి ఇలా విచ్చలవిడిగా కార్లు అందుబాటులో ఉండవు. కావాలంటే సైకిళ్లు ఎక్కి తిరగొచ్చు’ అని చెప్పడం ద్వారా హైదరాబాద్‌లో పర్యావరణ స్పృహ అంతగా లేదని పరోక్షంగా పేర్కొన్నారు. ఇలాంటి అంశాలను కూడా ‘ఉమ్టా’ పరిగణనలోకి తీసుకుంది. కానీ ఆ నివేదికను నాటి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
‘కార్ ఫ్రీ థర్స్‌డే’లా కావద్దు
నగరంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో కార్ల వినియోగం అత్యధికంగా ఉంది. మాదాపూర్ ప్రాంతంలో రోడ్లపై కార్లబార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ‘కార్ ఫ్రీ థర్స్‌డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం కారు బదులు బస్సుల్లో, ఇతర వాహనాల్లో ప్రయాణించాలనేది దీని ఉద్దేశం. రెండు మూడు నెలలు బాగానే అమలైనా ఆ తర్వాత అది నీరుగారింది. ఇప్పుడు గురువారాల్లోనూ యథాప్రకారం ఆ రోడ్లపై కార్లు పరుగుపెడుతున్నాయి.