
‘కార్పొరేట్’ దోపిడీని అరికడతాం
* ‘సాక్షి’ కథనాలు వాస్తవమే
* వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి
నల్లగొండ రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వైద్య దోపిడీని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. నల్లగొండలో శనివారం జరిగిన ఈఎన్‌టీ డాక్టర్ల రాష్ట్రస్థాయి సదస్పుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ వైద్య దోపిడీపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల గురించి ఈ సందర్భంగా స్పందించారు.
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టేందుకు త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రైవేటు వైద్యం కూడా ప్రభుత్వంలో భాగస్వామేనని, ఎక్కడో ఒకచోట కార్పొరేట్ ఆస్పత్రి వారు చేసే తప్పుతో మొత్తం వైద్యరంగానికే మచ్చ వస్తోందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు సాయం చేయాలని, పొరపాట్లు జరగకుండా వైద్య సేవలందించాలని కోరారు.
ఆశ వర్కర్లు సమ్మె విరమిస్తేనే..
అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు మంత్రి లక్ష్మారెడ్డికి వినపతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆశవ ర్కర్లు సమ్మె విరమిస్తేనే చర్చలకు పిలుస్తామని స్పష్టం చేశారు. ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్న సమయంలోనే సమ్మెకు దిగారన్నారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా నేరుగా సమ్మెకు ఎలా వెళతారని మంత్రి ప్రశ్నించారు.
రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. ఆ తర్వాత నల్లగొండ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగిని స్వయంగా పరీక్షించారు. మెడికల్, సర్జికల్, మెటర్నిటీ వార్డులను సందర్శించారు.