కార్పొరేషన్లకు కామన్ రాయితీ విధానం | corporations to Common subsidiarity | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లకు కామన్ రాయితీ విధానం

Published Sat, Sep 19 2015 4:52 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

corporations to Common subsidiarity

* ఎస్సీ, బీసీ  కార్పొరేషన్లకు ఒకే విధమైన సబ్సిడీ విధానం
* రూ. లక్షకు 80 శాతం, రూ. రెండు లక్షల వరకు 70 శాతం సబ్సిడీ
* అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి నూతన విధానం
సాక్షి, హైదరాబాద్ : వివిధ సంక్షేమ శాఖల లబ్ధిదారులకు శుభవార్త. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు సంబంధించి గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఈ పథకాల ద్వారా రుణాలు పొందే లబ్ధిదారులకు అధిక ప్రయోజనం కలగనుంది. ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలపై గరిష్ట రాయితీని 80 శాతానికి పెంచుతూ గత నెలలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కు కూడా ఇదే రాయితీ విధానాన్ని వర్తింపజేస్తూ తాజాగా నిర్ణయించింది. దీని ప్రకారం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.లక్ష లోపు రుణం పొందే లబ్ధిదారులకు 80 శాతం,  రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపు రుణంపై 70 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల లోపు రుణంపై 60 శాతం వరకు రాయితీని రూ.5 లక్షలకు మించకుండా చెల్లించే లా నిర్ణయించింది.

మైనారిటీ కార్పొరేషన్ కూడా ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరహాలోనే తమకు కూడా కొత్త రాయితీ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై కూడా త్వరలోనే సీఎం ఆమోదముద్ర పడవచ్చునని తెలుస్తోంది. ఎస్టీ కార్పొరేషన్ మాత్రం రూ. 2 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షల వరకు 70 శాతం, రూ.10 లక్షల వరకు 60 శాతం (రూ.5 లక్షలకు మించకుండా) రాయితీని కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే అక్టోబర్ ఒకటి నుంచి నూతన రాయితీ విధానం అమల్లోకి రానుంది. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల తరహాలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను ఆయా సంక్షేమశాఖలు విడివిడిగా ప్రకటించనున్నాయి. రుణ పరిమితిని కూడా గణనీయంగా పెంచడంతో 10 లక్షల రూపాయల వరకు గరిష్టంగా రుణం అందించడానికి అవకాశం ఏర్పడింది.

బ్యాంకుల ప్రమేయం లేకుండా రాయితీతోపాటు మిగిలిన రుణాన్ని సైతం ప్రభుత్వమే చెల్లించాలనే ప్రతిపాదనలు వచ్చినా ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. సబ్సిడీ మొత్తాలు పోను మిగిలిన రుణాలను బ్యాంకుల ద్వారానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరంలో యూనిట్లు గ్రౌండ్ చేయకుండా మిగిలిపోయిన వారికి ఈ నెలాఖరు వరకు పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement