రుణ పందేరం !
జిల్లాలో రుణ పందేరానికి తెరలేచింది. ఎస్సీ,బీసీ కార్పొరేషన్ల ద్వారా గత, ప్రస్తుత ఏడాదికి సబంధించిన రూ.45.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేస్తుండడంతో వాటిపై రాజకీయ దళారులు కన్నేశారు. రుణాల మంజూరు పేరుతో అందినకాడికి దోచుకునే పనిలో పడ్డారు. తమ అనుచరులను, ఆమ్యామ్యాలు ముట్టజెప్పేవారిని ఎంపిక చేసి... అర్హులకు అన్యాయం చేస్తున్నారు. పదవి, స్థాయిని వాటాలు పంచుకుంటున్నారని తెలిసింది. రుణాల కోసం చాలా ఏళ్లగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అవి దక్కడం లేదు. దీంతో ఇప్పటికే చాలా చోట్ల ఆయా సంఘాల వారు, రుణాలు దక్కని అర్హులు ఆందోళనలకు దిగారు. అయినా ఇవేవీ పట్టించుకోని నేతలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. విజయనగరం కంటోన్మెంట్: రెండేళ్లకు సబంధించిన బీసీ,ఎస్సీ కార్పొరేషన్ల రుణాలు విడుదలవడంతో రాజకీయ దళారీలు పండగచేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రుణ లబ్ధిదారుల ఎంపిక కమిటీల్లో తమ వారిని నియమించుకుని పంపకాలకు తెరలేపారు.
జిల్లాలో ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్‌కు ద్వారా 1,024 యూనిట్లకు గాను రూ 11.07 కోట్లు, గత ఏడాది 444 యూనిట్లకు రూ.5.12 కోట్లు మంజూరుకాగా, వీటి లో గ్రౌండ్ అవని యూనిట్లకు రుణాలు మంజూరు చేయనున్నారు. అలాగే బీస్సీ కార్పొరేషన్‌ద్వారా ఈ ఏడాది 9,393 యూనిట్లకు గాను రూ.25.70 కోట్లు, గత ఏడాదికి సంబంధించి 1,494 యూనిట్లకు గాను రూ.3.49 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేయడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని, వ్యయప్రయాసలకు ఓర్చి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 60 శాతం సబ్సిడీపై అందజేసే రుణాలు అధికంగా ఉండడంతో ఆ సొమ్మును తమ అనుచరుల ఖాతాలకు చేరేలా నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అర్హులను ఎంపిక చేయవలసిన కమిటీలో ఉండే ఏడుగురు సభ్యుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువమంది ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా సాగుతోంది.
గత ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 444 యూనిట్లకు 5.12 కోట్ల రుణాలు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేసినా కేవలం ఎనిమిది మాత్రమే గ్రౌండయ్యాయి. ఎన్నికల కోడ్ ఆటంకంతో మిగతా యూనిట్లు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 1,449 యూనిట్ల కోసం మార్జిన్ మనీ రుణాల కింద రూ.3.01 కోట్లు, రాజీవ్‌అభ్యుదయ పథకం కింద రూ. 35 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సహాయం కింద మరో 13 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కరికీ రుణం మంజూరు చేయకుండా నిలిపివేశారు. ఈ ఏడాది రుణాలతో పాటు గత ఏడాది నిలిపివేసిన వాటిని మంజూరు చేయడానికి కూడా పచ్చజెండా ఊపడంతో జిల్లాలో రుణాల సందడి మొదలయింది.
ఆందోళనలు
అర్హులయిన తమకు ఇవ్వకుండా నేతలు తమ అనుచరులకు రుణాలను పంచుకుంటున్నారని ఆయా సంఘాలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగాయి. ఇప్పటికే కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయంతో పాటు జిల్లాలోని మండలాల్లో కూడా ఆందోళనలు నిర్వహించారు. ఎంపిక కమిటీల్లో ఎస్సీలకు అవకాశం కల్పించలేదని, కేవలం రాజకీయనేతల అనుచరులనే కమిటీల్లో సభ్యులుగా నియమించడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ధర్నాలు నిర్వహించారు. అయినా వారి ఆవేదన, ఆందోళనను ఎవరూ పట్టించుకోలేదు. ఇది మా హక్కు అన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.
అనర్హులకు రుణాలిస్తే కమిటీలదే బాధ్యత
రుణాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కమిటీలు నియమించాం. అనర్హులను ఎంపిక చేస్తే కమిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పారదర్శకంగా రుణాలు మంజూరు చేయాలని కమిటీలకు చెప్పాం.
- రఘు, ఏఓ, ఎస్సీ కార్పొరేషన్