బ్యాంకర్లు మహిళలు వర్రీ
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీపై మహిళలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకూ రద్దుపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇటు మహిళలు, అటు బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు. రుణాలు రద్దవుతాయన్న ఆశతో మూడు నెలలుగా మహిళలు బకాయిలు చెల్లించడం నిలిపివేశారు. ఒకవేళ రుణమాఫీ జరగకపోతే మూడునెలలుగా చెల్లించవలసిన బకాయి మొత్తాన్ని ఒక్కసారిగా ఎలా చెల్లించాలంటూ వారు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రుణాల రికవరీ పూర్తిగా నిలిచిపోవడంతో బ్యాంకర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు.
డ్వాక్రా రుణం రూ.426.8 కోట్లు
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 28,500, పట్టణ ప్రాంతాలలో 6,500 పొదుపు సంఘాలు నమోదయ్యాయి. వీటిలో క్రియాశీలకంగా పనిచేసే సుమారు 34 వేల పొదుపు మహిళా గ్రూపులు వివిధ బ్యాంకుల నుంచి రూ.426.8 కోట్ల మేరకు రుణాలు ఇంతవరకు తీసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా 330 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 96.8 కోట్ల రూపాయల వరకు డ్వాక్రా మహిళలు రుణాలు తీసున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క సంఘం రూ 75 వేల నుంచి రూ. 5 లక్షల వరకూ రుణాలు పొందాయి. ఒక్కొక్క గ్రూప్ నుంచి నీసం రూ. 10 వేల వరకు ప్రతి నెలా రికవరీ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగానే గత కొన్నేళ్లుగా జిల్లాలో నెలకు సరాసరిన రూ. 35.5 కోట్ల మేర బ్యాంకర్లు రికవరీ చేస్తున్నారు. తమ రుణాలు అన్నీ రద్దయితే కొత్త రుణాలు తీసుకోవాలనే ఆశతో డ్వాక్రా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా కనీసం 10 శాతం రికవరీ కూడా కాలేదని బ్యాంకర్లు చెపుతున్నారు.
బ్యాంకర్లకు తలనొప్పి....
వాణిజ్య బ్యాంకులన్నీ ఎక్కువ శాతం రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు ఇచ్చాయి. డ్వాక్రా మహిళల గ్రూపునకు గరిష్టంగా రూ.5 లక్షల రుణాలు ఇవ్వడంతో ప్రతి మహిళా పెద్ద మొత్తంలోనే రుణం పొందారు. దీనికి తోడు రైతులు రుణాలు రద్దు అవుతాయని తెలిసి రైతులూ రుణాలు చెల్లించడం లేదు. దీంతో ప్రతి బ్యాంకులో టర్నోవర్ నిలిచిపోవడంతో బ్యాంకర్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. రుణాల రద్దుపై ఎటువంటి సమాచారం వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. రుణాల రద్దు విషయంలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఉంటే సంతోషిస్తామని లేదంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. గడువు మీరిన రుణాలకే రద్దు వర్తింపచేస్తే మిగిలిన వారు కట్టే పరిస్థితి కనిపించడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు.
బకాయిల వసూలుపై ఒత్తిళ్లు
డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ పొదుపు డబ్బు మాత్రమే చెల్లించి, తీసుకున్న రుణాల బకాయిలను జమ కట్టడం లేదని బ్యాంకర్లు తెలిపారు. దీంతో బ్యాంకింగ్ రంగంలో టర్నోవర్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు బకాయిలపై ఒత్తిడి అధికంగా వస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీని అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలపై కూడా బ్యాంకర్లు అంచనా చేస్తున్నారు.