భద్ర కాళికలై...
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో మహిళలు కదంతొక్కారు. మా ఓట్లతో గెలిచి, గద్దెనెక్కిన తరువాత విస్మరిస్తారా? అంటూ డ్వాక్రాసంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. రుణాలు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించి, కలెక్టర్‌ను ఘెరావ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీ నెరవేర్చకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఇందిర మాట్లాడు తూ చంద్రబాబునాయుడు హామీలను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు కొర్రీలు వేస్తున్నారన్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాము అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామని నమ్మ బలికారన్నారు. మరోపక్క బ్యాంకర్లు కూడా మహిళలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పొదుపు చేసిన సొమ్మును రుణ వాయిదాలకు మల్లిస్తున్నారని ఆరోపించారు. సభ్యులకు తెలియకుండా వారి ఖాతాల్లోని సొమ్మును బ్యాంకర్లు మల్లించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయన్నారు.
సొమ్ము చెల్లించకపోతే డిఫాల్టర్ల జాబితాలో చేర్చుతామని ప్రకటిస్తుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దని చెప్పిన చంద్రబాబు....బ్యాంకర్లు నోటీసులు ఇస్తుంటే కిమ్మనకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న 32వేల డ్వాక్రా గ్రూపులు రూ.421 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉందని చెప్పారు. కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నికల ముందు నుంచే డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మా నేశారన్నారు. అయితే ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నార ని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు రద్దు చేయకుంటే ప్రభుత్వం అంతు చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలానే పావలా వడ్డీలు, ఇతర హామీలను అమలు చేయకపోవడం వల్లే భూ స్థాపితం అయిందనే విషయాన్ని మర్చి పోకూడదన్నారు.
కలెక్టర్ ఘెరావ్!
కలెక్టరేట్ ఎదురుగా పలు సంఘాలు ధర్నాలు చేస్తుండడంతో మహిళలను వేరే గేటు వద్దకు పోలీ సులు పంపించారు. దీంతో రెండు గేట్ల వద్దా ధర్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలియ ని కలెక్టర్ ఒక గేటు వద్ద ధర్నా జరుగుతోందని రెండోగేటు వైపునకు వెళ్లారు. అక్కడే ధర్నా చేస్తు న్న డ్వాక్రా మహిళలు కలెక్టర్ వచ్చిన విషయం గమనించి ఆయన వాహనాన్ని ముట్టడించారు. కలెక్టర్ వాహనం దిగివెళ్తుండగా మహిళలు ఆయ న్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన మీ సమస్య చెప్పండి పరిష్కారానికి ప్రయత్నిస్తాననడంతో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యు లు తమకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్‌కు వివరించారు. తమ ఖాతాల్లో సొమ్మును తమకు తెలియపర్చకుండా బకాయిలకు జమ చేస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని, ఇంతకూ తమకు రుణాలు మాఫీ చేస్తారా చేయరానన్న విషయాన్ని ప్రభుత్వాన్ని అడిగి చెప్పాలన్నారు. అనంతరం కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వెం టనే ఈవిషయాన్ని ప్రభుత్వానికి చేరవేస్తానన్నా రు. అంతేకాకుండా బ్యాంకర్లతో మాట్లాడి నోటీసు ల విషయం, డబ్బు జమ చేస్తున్న విషయాన్ని అడి గి ఇటువంటి చర్యలు లేకుండా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ టి జ్యో తితో మాట్లాడి...బ్యాంకులు ఇలా సొమ్ము మల్లిం చడం, నోటీసులు ఇచ్చే విషయంపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీంతో ఆమె ఐద్వా నా యకుల నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. ధర్నాలో రమణమ్మ, శ్రీదేవి , పి రమణమ్మ, రెడ్డి మణి, ఎస్ సరస్వతి, బి లక్ష్మి, వి రామలక్ష్మిలతో పాటు డ్వాక్రా మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.