ఏం కష్టమొచ్చిందో?
= కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య
= కొట్టూరులో విషాదం
అల్లారుముద్దుగా గోరుముద్దులు తినిపించాల్సిన తల్లిదండ్రులు తమ బిడ్డకు విషం తాగించారు. ఆపై తామూ అదే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఏం కష్టమొచ్చిందో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బళ్లారి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ పరిధిలోని కొట్టూరు పట్టణానికి చెందిన మృత్యుంజయ(47), అతని భార్య మధుమతి(38)లు పురుగుల మందు తాగి, తమ చివరి కుమార్తె బిందు(3)కూ తాగించి ఆత్మహత్య చేసుకోవడంతో కొట్టూరులో విషాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని హగరి గజాపుర రోడ్డులోని తమ పొలంలో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే మరో ఇద్దరు కుమార్తెలు తన తల్లి వద్ద ఉన్నారని, తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు డెత్‌నోట్‌లో రాసి పెట్టడం గమనార్హం.
వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే మృత్యుంజయ ఉన్న ఫళంగా భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం వెనుక వ్యాపార లావాదేవీలేమైనా కారణమై ఉంటాయా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందిన వెంటనే కొట్టూరు సీఐ రవీంద్ర తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కొట్టూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.