కాంగ్రెస్‌లో కొత్తనీరు.. ఆ క్రెడిట్ ఆమెదే..!
- అఖిలేశ్, డింపుల్‌తో చర్చలు
తుదివరకు ఉత్కంఠరేపుతూ తీవ్ర మంతనాల నడుమ ఉత్తరప్రదేశ్‌లో అధికార ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మ్యానిఫెస్టో ప్రకటన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలవరకు జరిగిన మంతనాలు, చర్చల అనంతరం ఈ పొత్తు కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొదట కాంగ్రెస్‌కు 99 సీట్లు ఇవ్వడానికి ఎస్పీ అంగీకరించగా.. హస్తం నేతల మొండిపట్టుతో 105 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకొంది. దీంతో హస్తంతో పొత్తు ఖాయమని సీఎం అఖిలేశ్ కూడా విలేకరులకు వెల్లడించారు.
అత్యంత నాటకీయంగా సాగిన ఈ పొత్తు వ్యవహారంలో పూర్తి క్రెడిట్ ప్రియాంకగాంధీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపడం గమనార్హం. పార్టీ సీనియర్ నేత, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ట్వీట్ చేస్తూ ప్రియాంకకు క్రెడిట్ ఇచ్చారు. ’(పొత్తు చర్చల కోసం) కాంగ్రెస్ పార్టీ చిన్నస్థాయి నేతలు మాత్రమే రంగంలోకి దిగారనడం తప్పు. అత్యున్నత స్థాయిలో యూపీ సీఎం, ప్రియాంకాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మధ్య చర్చలు జరిగాయి’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
పొత్తు చర్చల్లో ప్రియాంకగాంధీ అత్యంత చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అఖిలేశ్, ఆయన సతీమణి డింపుల్‌తో కూడా ఆమె చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, సీట్ల పంపకాల్లో రాజీ కుదరకపోవడంతో శనివారం పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో సోనియాగాంధీ రంగంలోకి దిగి జోక్యంతోనే పొత్తు ఖరారైందని ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలు ప్రియాంకకు క్రెడిట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల్లో అంటీముట్టనట్టు ఉన్న ప్రియాంక రానున్న యూపీ ఎన్నికల్లో మరింత చురుగ్గా పాల్గొంటారేమోనన్న రీతిలో సంకేతాలు ఇస్తున్నారు.