
గుడ్ న్యూస్.. యుద్ధానికి సరిపడా ఆర్మీకి సామగ్రి
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్థాయీసేన(స్టాండింగ్ ఆర్మీ) కలిగిఉన్న భారత్.. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే శత్రువుతో పది రోజులకు మించి పోరాడలేదు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్థాయీసేన(స్టాండింగ్ ఆర్మీ) కలిగిఉన్న భారత్.. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే శత్రువుతో పది రోజులకు మించి పోరాడలేదు! ఎందుకంటే అవసరమైనంత మందుగుండు సామగ్రి భారత్ వద్ద లేదు!! శుక్రవారం పార్లమెంట్ ముందుంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలివి.
కాగ్ రిపోర్టు నేపథ్యంలో రక్షణ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్‌లు కయ్యానికి కాలుదువ్వుతున్నవేళ ఇండియన్ ఆర్మీని వేధిస్తున్న మందుగుండు కొరతను తీర్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీలైనన్ని మార్గాల్లో.. సాధ్యమైనంత తొందరగా మందుగుండు నిల్వను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆగస్టు ఒకటో వారంలోగా యుద్ధ ట్యాంకులకు, తుపాకులకు అవసరమైన మందుగుండు భారీగా అందనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
భారత బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రిలో ప్రస్తుతం కేవలం 40 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని నూటికి నూరు శాతం పెంచేలా రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది చివరినాటికి.. సుదీర్ఘ యుద్ధం చేయడానికి సైతం అవసరమైన మందుగుండు సామగ్రి సైన్యానికి అందబోతున్నట్లు సమాచారం.
గత ఏడాది ఉరీ ఉగ్రదాడి అనంతరం రక్షణశాఖ రూ.12,000 కోట్లతో మందుగుండు కొనుగోలుకు ఆర్డర్లు జారీచేసింది. మరోవైపు 46 రకాల యుద్ధ సామగ్రి కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాధికారాలను ఆర్మీ వైస్ చీఫ్‌కు కట్టబెట్టింది. తద్వారా సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రక్షణశాఖ భావిస్తోంది.
ఇండియన్ ఆర్మీకి అవసరమైన మందుగుండు సామగ్రిలో 90 శాతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ) నుంచే సరఫరా అవతున్న సంగతి తెలిసిందే. అయితే, 2013 నుంచి పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఓఎఫ్‌బీ విఫలమైందని కాగ్ రిపోర్టులో వెల్లడైంది.