
శంకుస్థాపనకు సినీ హంగులు
వేదిక నిర్మాణం నుంచి కార్యక్రమాల వరకూ
దర్శకుల సూచనల మేరకు ఏర్పాట్లు!
సాయికుమార్ యాంకరింగ్, శివమణి సంగీతం
విజయవాడ : అమరావతి శంకుస్థాపనను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కోసం సినీ హంగులు అద్దుతోంది. తారల తళుకు బెళుకులు, పాటలు, సంగీత కార్యక్రమాలు, నవ్వులు పండించే స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభకు వచ్చిన వారిని కట్టి పడేసే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిసింది. వేదిక నిర్మాణం నుంచి కార్యక్రమాల వరకు అన్నీ వారి సూచనల మేరకే రూపొందించారు.
సాధ్యమైనంత వరకు వారిని నేరుగా కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, ప్రముఖ గాయని సునీత సభలో యాంకరింగ్ చేయనున్నారు. ప్రధానమంత్రి రావడానికి ముందు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలను వీరితో నిర్వహించడం ద్వారా ఉదయమే వచ్చిన వారిని ఆకట్టుకోవడంతో పాటు, వారు తిరిగి వెళ్లిపోకుండా ఉండేందుకు కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ సంగీత వాయిద్య కళాకారుడు శివమణి డ్రమ్స్ ప్రోగ్రాం, భవిరి రవి స్కిట్స్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు.
ప్రముఖ దర్శకుల కోసం యత్నాలు
వేదికను కూడా సినిమా సెట్టింగ్ మాదిరిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మొదట్లో ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని సంప్రదించింది. బాహుబలి సినిమాలో అదిరిపోయే సెట్టింగ్‌లు వేసిన రాజమౌళిని వేదిక రూపకల్పన ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన స్పందించలేదు. దీంతో గోదావరి పుష్కరాల్లో హారతి ఏర్పాట్లు చేసిన మరో దర్శకుడు బోయపాటి శ్రీనుతో మాట్లాడారు. పుష్కరాల్లో పనిచేసినప్పుడు వివాదం ఏర్పడడంతో ఈసారి ఆయన ముందుకు రాలేదు. దీంతో ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేథీని చంద్రబాబు రంగంలోకి దించారు.
వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ప్రాచీన కళారూపాలు, సాంస్కృతిక వైభవం గురించి పరిశోధన చేసిన సేథీకి అమరావతి ప్రాచీనత ఉట్టిపడేలా వేదికను నిర్మించే బాధ్యత అప్పగించారు. ఇందుకోసం ఆయనకు కోటి రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కూడా వేదిక నిర్మాణంలో పాలుపంచుకుంటాయి. కళాత్మకతతో పాటు అందరినీ ఆకర్షించేలా సినిమా సెట్టింగ్‌లను కూడా వేదిక నిర్మాణానికి పరిశీలిస్తున్నారు. వీటితో పాటు కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కొద్దిసేపు కూచిపూడి కళాకారులు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ రూపకాన్ని ప్రదర్శించనున్నారు.