న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్‌లో (2013-14, జూలై-సెప్టెంబర్) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ-క్యాడ్) భారీగా తగ్గింది. ఈ క్వార్టర్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.2 శాతంగా నమోదయ్యింది. విలువ పరంగా ఇది 5.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో 21 బిలియన్ డాలర్లు (జీడీపీలో 5 శాతం). ఎగుమతులు మెరుగుపడడం, బంగారం దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ఆర్‌బీఐ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
క్యాడ్ అంటే
క్యాడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 56 బిలియన్ డాలర్ల వరకూ తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) అంచనావేస్తోంది. బంగారం దిగుమతులు భారీగా తగ్గుతుండడం దీనికి ప్రధానంగా దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు ఎగుమతులు పెరుగుదల, ఇది వాణిజ్యలోటు తగ్గడానికి దారితీస్తున్న సానుకూల ధోరణి సైతం ఇందుకు దోహదపడుతుందని భావిస్తోంది.
క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత పెట్టుబడులు), ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు), ఈసీబీ(విదేశీ వాణిజ్య రుణాలు) మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). క్యాడ్‌ను ప్రధానంగా ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల ద్వారా ఫైనాన్స్ చేస్తారు. ఒకవేళ ఈ నిధులు సరిపోకపోతే మొత్తం దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను ముట్టుకోవాల్సి ఉంటుంది. క్యాడ్ భారీగా తగ్గడం స్థూల ఆర్థికాంశాలకు ప్రోత్సాహకర అంశంగా ప్రభుత్వం భావిస్తోంది.
బంగారంపై చర్యల ఫలితం!
క్యాడ్ కట్టడికి బంగారం దిగుమతి సుంకాన్ని 10% వరకూ కేంద్రం పెంచింది. నాణేలు, కడ్డీల దిగుమతులను నిషేధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గుతాయనే అంచనాలు ప్రభుత్వానికి ఉన్నాయి. దేశం పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 41 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. సుంకాల పెంపు కారణంగా దేశీయంగా భారీగా ఉన్న రేట్లు సైతం బంగారం డిమాండ్ పడిపోడానికి కారణమవుతోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 850 టన్నులు. అయితే 2013-14లో ఈ పరిమాణం 500 టన్నులకు పరిమితం కావచ్చని అంచనా.