బీభత్సం సృష్టించిన తుఫాను
పై-లీన్ తుఫాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం వణికించింది. ప్రకృతి విలయం సృష్టించింది. ఏకంగా 60-100 టన్నుల బరువుండే కంటెయినర్లు కూడా గాలి వేగానికి ఆగలేక పడిపోయాయంటే తుఫాను ఎంత తీవ్రస్థాయిలో వచ్చిందో తెలుస్తుంది. ఈ తుఫాను బీభత్సాన్ని రాష్ట్ర ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించేందుకు వెళ్లిన పలు మీడియా వాహనాలు కూడా గాలి వేగానికి కొట్టుకుపోయాయి. సాక్షి ఓమ్నీ వ్యాన్ దాదాపు 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. సాక్షి మీడియా సహా పలు మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది మొత్తం గోపాల్పూర్లోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. ఆ హోటల్ యజమాని జనరేటర్ ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించినా, సమాచార వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావడంతో విజువల్స్ తెల్లవారే వరకు అందలేకపోయాయి. హోటల్ అద్దాలు పగిలిపోయాయి. షట్టర్లను తోసుకుని మరీ గాలి వచ్చేసింది.
గంజాం జిల్లాలో పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. టెలిఫోన్ టవర్లు, విద్యుత్ టవర్లు కూలిపోయాయి. దీంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఒడిశాలోని దాదాపు ఏడు జిల్లాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. మంచినీటి సరఫరా అంతంతమాత్రమే. ఒక మాదిరి కచ్చా ఇళ్లన్నీ కూలిపోవడంతో ముందుగానే అక్కడి ప్రజలు పెద్ద భవనాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు.