ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు
ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 90 కిలోమీటర్ల వాయవ్యంగా కేంద్రీకృతమై ఉన్న పై-లీన్ తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్పూర్లో తీవ్ర విధ్వంసం సంభవించింది. పక్కా ఇళ్లు తప్ప పూరిళ్లు అలన్నీ కూలిపోయాయి. సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. తీరప్రాంతాల్లో ఇప్పుడు కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మరో 36 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పై-లీన్ తుఫాను ప్రభావంతో ఒడిసా పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజికి వరద నీరు ఉధృతంగా వస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు బ్యారేజికి ఉన్న 8 గేట్లు ఎత్తేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో వరద గాలుల తీవ్రతకు 15 పడవలు దెబ్బతిన్నట్లు సమాచారం.