మిస్త్రీపై టాటా సన్స్ మరో లేఖాస్త్రం
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్థాంతరంగా తొలగించారంటూ వాదిస్తున్న సైరస్ మిస్త్రీ ఆరోపణలను ఖండిస్తూ.. టాటా గ్రూప్ హోల్డిండ్ కంపెనీ టాటా సన్స్ తొమ్మిది పేజీల ప్రటకనను విడుదల చేసింది. గతనెల ఉన్నపళంగా సైరస్ మిస్త్రీని తొలగించడానికి గల కారణాలను ఆ ప్రకటనలో వివరణ ఇచ్చింది. మిస్త్రీని అర్థాంతంరంగా తొలగించామన్న వాదన సరికాదని పేర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆదాయాలను పక్కనపెడితే, గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీ ఎలాంటి గణనీయమైన సహకారాన్ని నిర్వర్తించలేదని తెలిపింది. మిస్త్రీ హయాంలో టాటా గ్రూప్లోని 40 ఇతర కంపెనీల డివిడెంట్లు క్రమంగా క్షీణించాయని వెల్లడించింది.
2012-13లో రూ.1,000 కోట్లగా ఈ ఇతర కంపెనీలు తీసుకునే డివిడెంట్స్ 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి రూ.780 కోట్లకు దిగజారాయని మిస్త్రీ ఆరోపణలపై టాటాసన్స్ మండిపడింది. మిస్త్రీ అంతకముందు గ్రూప్ కంపెనీల వృద్ధికి, మేనేజ్మెంట్ రూపురేఖలకు కొన్ని ప్రణాళికలను తమతో షేర్ చేసుకునేవాడని, కానీ చైర్మన్గా ఎన్నికయ్యాక మాత్రం నాలుగేళ్ల కాలంలో ఈ ప్రణాళికలను అసలు అమలుపరుచలేదని ప్రకటనలో పేర్కొంది.
వాటిని పక్కన బెడితే, చాలా కంపెనీలు ఇప్పుడు ఆ కొత్త నిర్మాణాలను అసలు ఆమోదించడం లేదని వెల్లడించింది. టాటా గ్రూప్లో ప్రధానమైన ఆపరేటింగ్ కంపెనీలను తన ఆధీనంగా తెచ్చుకోవాలనుకునేవాడని, చాలా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడేవాడని టాటా సన్స్ ఆరోపించింది. టాటా సన్స్ చైర్మన్గా బయటికి నెట్టేసిన అనంతరం సైరస్ మిస్త్రీ గ్రూప్పై తీవ్ర ఆరోపణలకు పాల్పడారు. తన తొలగింపు చట్టవిరుద్దమని, ఈ నిర్ణయం పనిచేయదని వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు అనంతరం ప్రపంచవ్యాప్తంగా చాలా ఈమెయిల్స్, కాల్స్ను తాము అందుకున్నామని, ఈ నిర్ణయంపై వారికి వివరణ ఇచ్చినట్టు టాటా సన్స్ గురువారం ప్రకటనలో తెలిపింది. గ్రూప్ కంపెనీల భవితవ్యంపై కూడా చాలామంది అడిగారని, వారిని ఆందోళనల నుంచి బయటపడేయడానికి ఈ ప్రకటనను వెలువరిచినట్టు పేర్కొంది.