మరో ప్రేమి‘కుల’ చిచ్చు | dalit murdered, wife attacked in tamilnadu | Sakshi
Sakshi News home page

మరో ప్రేమి‘కుల’ చిచ్చు

Published Tue, Mar 15 2016 5:52 AM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్, గాయలతో కౌసల్య - Sakshi

రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్, గాయలతో కౌసల్య

ప్రియుడి దారుణ హత్య
* నడిరోడ్డుపై జనం మధ్యలో ఘాతుకం
* ఉడుమలైలో కలకలం
* ప్రియురాలికి కత్తి పోట్లు
* కోర్టులో లొంగి పోయిన తండ్రి
* పరువు హత్యతో ఉద్రిక్తత

సాక్షి, చెన్నై: మరోమారు ప్రేమి‘కుల’ చిచ్చు రగిలింది. కుమార్తె కులాంతర ప్రేమ వ్యవహారం ఓ తండ్రిలో ఆక్రోశాన్ని రగిల్చింది. ప్రియుడి రూపంలో తన బిడ్డ దూరం కావడంతో ఆ తండ్రి కిరాతకానికి  ఒడిగట్టాడు.

కిరాయి ముఠా ద్వారా నడిరోడ్డుపై వందలాది మంది జనం చూస్తుండగా తన కుమార్తెకు భర్తగా మారిన ఆ ప్రియుడ్ని అతి కిరాతకంగా నరికి చంపించాడు. ఉడుమలైలో జరిగిన ఈ ఘాతుకం దృశ్యాలు వాట్సాప్, సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తుండడంతో కలకలం బయల్దేరింది.
 
రాష్ట్రంలో ఇటీవల కాలంగా కులాంతర వివాహాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్‌లతో పాటుగా మరెందరో ప్రేమికులు కుల చిచ్చుకు బలి అయ్యారు. అగ్ర వర్ణ యువతుల్ని ప్రేమించడం వీరు చేసిన తప్పు. ప్రేమించడమే కాదు, ఆ యువతుల్ని భార్యలుగా చేసుకున్న పాపానికి చివరకు  ఇలవరసన్, గోకుల్ రాజ్ లాంటి వాళ్లు  విగత జీవులు కాక తప్పడం లేదు. ఈ పరువు హత్యల పరంపర రాష్ట్రంలో కొనసాగుతున్నా, అడ్డుకట్ట వేసే వారెవ్వరు. తాజాగా తిరుపూర్ జిల్లా ఉడుమలైలో వందలాది మంది చూస్తుండగా, అతి కిరాతకంగా ఘాతుకం జరగడం మరో మారు ప్రేమికుల చిచ్చును రగిల్చింది.
 
కిరాతకం: దిండుగల్‌కు చెందిన చిన్నస్వామి కుమార్తె కౌసల్య తిరుపూర్ మడత్తుకులం కుమర తంగచావడిలోని ఓ సంస్థలో పనిచేస్తోంది. అక్కడే ఓ హాస్టల్లో ఉంటూ పనిచేస్తున్న ఆమె అదే ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి శంకర్ ప్రేమలో పడింది. ఈ ఇద్దరు చెట్టాపట్టల్ వేసుకుని తిరుగుతుండడం చిన్నస్వామి దృష్టికి చేరింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో కౌసల్యను ఖండించి ఇంటికి పరిమితం చేశాడు. అయితే ఎనిమిది నెలల క్రితం ఇంటి నుంచి ఉడాయించిన కౌసల్య ఓ ఆలయంలో శంకర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

ప్రియుడు భర్త కావడంతో ఇద్దరూ కలసి కుమర తంగ చావడిలో కాపురం పెట్టారు. సజావుగా వీరి కాపురం సాగుతూ వచ్చినా, కుమార్తె కులాంతర వివాహం చిన్నస్వామిలో ఆక్రోశాన్ని రగిల్చింది. తన బిడ్డను దూరం చేసిన శంకర్‌ను కడతేర్చేందుకు పథకం రచించుకున్నాడు. కౌసల్య, శంకర్‌లను ఎప్పటి నుంచి కిరాయి ముఠా వెంబడిస్తూ వచ్చిందో ఏమోగానీ, ఆదివారం తమ పథకాన్ని ఆచరణలో పెట్టారు.
 
నడిరోడ్డుపై ఘాతుకం:
నడిరోడ్డుపై శంకర్‌ను హత్య చేసిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కడం కలకలం రేపింది. ఓ జౌళి దుకాణం నుంచి బయటకు వచ్చి, బస్టాండ్ వైపుగా నడిచి వెళ్తున్న కౌసల్య, శంకర్‌లను వెంబడిస్తూ ఇద్దరు వ్యక్తులు వెళ్లడం, రోడ్డు దాటుతున్న సమయంలో ఓ మోటార్ బైక్ రావడం, అందులో నుంచి కత్తులతో దిగిన యువకులు నడిరోడ్డుపై వందలాది మంది జనం చూస్తుండగానే తమ పథకాన్ని అమలు చేశారు. అతి కిరాతకంగా శంకర్‌ను నరకడం, అడ్డొచ్చిన కౌసల్య మీద సైతం దాడి చేయడం క్షణాల్లో జరిగాయి.

అడ్డుకునేందుకు పలువురు యత్నించినా, ఆ ముగ్గురు యువకులు తిరగబడడం, అందరూ చూస్తుండగా సినీ ఫక్కీలో మోటారు సైకిల్ ఎక్కి ఉడాయించారు. అక్కడున్న జనం మాత్రం బిత్తర చూపులు చూడక తప్పలేదు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న శంకర్‌ను, తీవ్ర రక్తగాయాలతో పడి ఉన్న కౌసల్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో శంకర్ మరణించగా, కోయంబత్తూరు ఆసుపత్రిలో కౌసల్య చికిత్స పొందుతున్నది.
 
అప్రమత్తం: ఉడుమలై బస్టాండ్ సమీపంలోని రద్దీతో కూడిన నడిరోడ్డు మీద ఈ ఘాతుకం జరడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. మోటారు సైకిల్‌పై ఉడాయించిన ఆ ముగ్గురు యువకుల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగాయి. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇంతకీ ఈ హత్యకు గల కారణాలేమిటోనని తలలుపట్టుకున్నారు. అయితే సోమవారం  ఉదయం నెలకోట్టై మేజిస్ట్రేట్ రిజ్వానా ఎదుట కౌసల్య తండ్రి చిన్నస్వామి లొంగి పోవడంతో ఇది ప్రేమికుల చిచ్చు రగిల్చిన హత్యగా తేలింది.

తన తండ్రి పథకం ప్రకారం ఈ హత్య చేయించాడని కౌసల్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు. రెండు రోజుల క్రితం తన తండ్రి వచ్చి సంప్రదింపులు జరిపినట్టు, కుటుంబం, బంధువుల ఎదుట తలెత్తుకోలేని పరిస్థితి ఉన్నట్టు, శంకర్‌ను వదిలి పెట్టి రావాలని సూచించినట్టు పేర్కొన్నారు. తాను రాబోనని ఖరాఖండీగా తేల్చడం జరిగిందన్నారు. తొమ్మిదో తేదీన తన భర్త శంకర్ పుట్టిన రోజు అని, అందుకే తనకు వచ్చిన జీతంతో దుస్తులు కొని ఇద్దరూ ఇంటికి బయల్దేరిన సమయంలో కిరాతకంగా కడతేర్చారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తమ వాడ్ని కడతేర్చి వాళ్లను అతి కిరాతకంగా శిక్షించే వరకు మృతదేహాన్ని తీసుకోబోమంటూ శంకర్ కుటుంబీకులు స్పష్టం చేసి ఉన్నారు. ఈ ఘాతుకంతో ఉడుమలై, తిరుపూర్, దిండుగల్, పరిసరాల్లో  ఉద్రిక్తత నెలకొనింది. ఈ చిచ్చు మరింత రగలకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు.
 
సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాలు:
కౌసల్య, శంకర్‌ల మీద గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా జరుపుతున్న దాడులు సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లోని సీసీ కెమెరాకు చిక్కాయి. ఇవి సోమవారం వాట్సాప్, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షం అయ్యాయి. వారిని ఇద్దరు వెంబడించడం, మోటార్ బైక్‌లో వచ్చి యువకుడు అందించిన ఆయుధాలతో దాడులు చేయడం వంటి దృశ్యాలు అందులో ప్రత్యక్షం అయ్యాయి. అలాగే, ఓ కారు ఆగడం, ఆ పక్కనే మరో ముగ్గురు సైతం వచ్చి దాడి చేయడం వెరసి ఈ హత్య పథకం అమల్లో ఆరుగురు ఉండొచ్చన్న అనుమానాలు బయల్దేరాయి. అయితే, ముగ్గురు యువకులు మాత్రం మోటార్ సైకిల్ మీద ఉడాయించడం, వారు వెళ్లగానే ఆ కారు ముందుకు కదలడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement