'చనిపోయిన ఆవుల్ని ముడితే ఒట్టు!'
ఉనా: చనిపోయిన ఆవుల్ని ఇక ముట్టుకోబోమని, వాటి చర్మాన్ని వొలిచే పనులను స్వస్తిపలుకుతున్నామని గుజరాత్ లోని ఉనాలో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాది మంది దళితులు ప్రతిజ్ఞచేశారు. 'ఆవు తోక మీరే పట్టుకొని గుజరాత్‌లోని ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించండి’ అని ఉనా దళిత్ అత్యాచార్ లదత్ సమితి (యూడీఏఎల్‌ఎస్) డిమాండ్ చేసింది. నెల రోజుల్లో తమ డిమాండ్ నెరవేర్చకుంటే మెగా రైల్ రోకో నిర్వహిస్తామని గుజరాత్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దళితులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని కోరింది.
కొద్ది రోజుల కిందట చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితులపై కొందరు గో సంరక్షకులు అమానుషంగా దాడి చేయడానికి నిరసనగా అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైన యాత్ర సోమవారం ఉనా చేరుకుంది. వేలాది మంది దళితులు, ముస్లింలు ఒక్క చోట చేరి 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ భారీ నిరసన ప్రదర్శనలో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ తల్లి రాధిక వేముల, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్, ఉనా బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే దళితులపై అత్యాచారాలు, వివక్ష నుంచి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి నేతృత్వం వహించిన జిగ్నేశ్ మవేనీ మాట్లాడుతూ.. తమ డిమాండ్ ప్రకారం రాష్ట్రంలోని దళితులకు వచ్చే నెల రోజుల్లోపు ఐదెకరాల భూమి కేటాయించకుంటే రైల్ రోకో చేపడతామని అల్టిమేటం ఇచ్చారు. అలాగే ఆవుల చర్మాల వ్యాపారాన్ని ఆపివేస్తామని దళితులు ప్రతిజ్ఞ చేశారు. అలాగే 2012లో తంగధ్ పట్టణంలో ముగ్గురు దళిత యువకుల్ని పోలీసులు కాల్చివేసిన ఘటనపై ప్రధాని మోదీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కన్హయ్య మాట్లాడుతూ.. గుజరాత్ అభివృద్ధి నమూనా ప్రచారానికి దళితులు గాలి తీశారని వ్యాఖ్యానించారు. కులతత్వం నుంచి విముక్తి కావాలని నినాదాలు చేశారు. రాధిక వేముల మాట్లాడుతూ.. కేవలం కులం వల్లే ఆత్మహత్యకు పాల్పడిన తన కుమారుడి పరిస్థితి ఏ యువకుడికీ రాకూడదనే ఇక్కడి వచ్చినట్లు పేర్కొన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లింలు దళిత్-ముస్లిం భాయి భాయి’ అనే నినాదాలతో హోరెత్తించారు.