
దళితుల రిజర్వేషన్లపై కన్నేశారు!
నితీశ్, లాలూలపై నిప్పులు చెరిగిన మోదీ
రిజర్వేషన్లు లేకపోతే..ఆ బాధేంటో నాకు తెలుసు
బక్సర్: బిహార్ ఎన్నికల్లో గెలిస్తే.. దళితుల, బీసీల రిజర్వేషన్లనుంచి 5 శాతం లాగేసుకుని తమ వర్గం వారికి ఇచ్చేందుకు నితీశ్, లాలూ కూటమి ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం బక్సర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మహా‘స్వార్థ’ కూటమి నేతలు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తమవారికి లాభం చేసేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ‘దళితులు, మహాదళితులు, వెనుకబడినవారి రిజర్వేషన్లలో నుంచి 5 శాతాన్ని తీసి వారి వర్గం వారికి ఇవ్వాలనుకుంటున్నారు.
ఓ వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన వాడిగా.. ఓ పేద తల్లికి పుట్టిన వాడిగా.. రిజర్వేషన్లు లేకపోతే ఉండే బాధేంటో నాకు తెలుసు. అందుకే వారి కుట్రలు అమలుకాకుండా ఆపుతాను’ అనిఅన్నారు. అవినీతిపై పాఠాలు చెప్పే నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యే, మంత్రి లక్షలు తీసుకుంటూ పట్టుబడినా.. వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. యువతకు ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామన్న నితీశ్.. అది నడిచేందుకు కరెంటును ముందు ఇవ్వాలన్నారు. లాలూ వైరస్ సోకిన ఆ ల్యాప్‌టాప్‌లు బిహార్ యువతకు అవసరం లేదన్నారు. తాము గెలిస్తే బిహార్లో రెండో హరిత విప్లవాన్ని ప్రవేశపెడతామన్నారు.
చర్చకు సిద్ధం: నితీశ్
కోటాపై మోదీ ఆరోపణలను బిహార్ సీఎం నితీశ్ ఖండించారు. దళితుల ఓట్లు పడవనే ఆందోళనతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అభివృద్ధి విషయంలో గుజరాత్ మోడల్ - బిహార్ మోడల్‌పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.