
లాలూ, నితీశ్‌ది తిరోగమన ఎజెండా
గెలవలేరని తెలిసే తాంత్రికులను ఆశ్రయిస్తున్నారు
♦ మహాకూటమి నేతలది 18వ శతాబ్దపు ఆలోచన
♦ రిజర్వేషన్లపై భయాందోళనలు అవసరం లేదు
♦ బిహార్ అభివృద్ధికి సిక్స్‌పాయింట్ ఫార్ములా ప్రకటన
నలంద/పట్నా: బిహార్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటే.. లాలూ, నితీశ్ మాత్రం తిరోగమన దిశలో.. 18వ శతాబ్దపు ఆలోచనా ధోరణిలోనే ముందుకెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మూడో విడత ఎన్నికలు జరిగే నలంద ప్రాంతంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తాంత్రికులను కలుస్తున్నారని.. రాష్ట్రాన్ని 18వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని విమర్శించారు. మహాకూటమి మిత్రుడు లాలూపై పగ తీర్చుకునేందుకే నితీశ్ తాంత్రికుడిని కలిశాడన్నారు. వెనుకబడిన తరగతులనుంచి వచ్చిన తను ప్రధాని మంత్రి కావటాన్ని నితీశ్, లాలూ జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే కుల రాజకీయాలు చేస్తూ.. విభజించు-పాలించు సూత్రం ద్వారా ప్రజల్లో చిచ్చు పెడుతున్నారన్నారన్నారు.
బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ మహాకూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవ లేదన్నారు. అంబేద్కర్ రూపొందించిన రిజర్వేషన్ల వ్యవస్థను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కోటాను తొలగిస్తారంటూ.. విష ప్రచారం చేయటం.. నితీశ్, లాలూలకే చెల్లిందన్నారు. ‘ఈ పాతకాలం ఆలోచనల నాయకులనుంచి బిహార్ విముక్తి కావాలి. ఇక్కడి యువతకు తంత్రాలు కాదు.. ల్యాప్‌టాప్‌లు కావాలి. బిహారీనా.. బాహరీనా?(బయటి వారా) అని ప్రశ్నించేవారు.. ఇక్కడి యువత బాహరీ (బయటి) రాష్ట్రాల్లోకి వెళ్లి ఉద్యోగాలు చేసుకుని బతకాల్సిన పరిస్థితి కల్పించినపుడు.. ఎందుకు బాహరీ గురించి మాట్లాడలేద’ని మోదీ ప్రశ్నించారు.
ప్రపంచంలోనే పెద్ద తాంత్రికుడైన లాలూ తన పార్టీ ఆర్జేడీని రాష్ట్రీయ జాడూ తోనా(తాంత్రిక శక్తుల ప్రయోగ పార్టీ)గా మార్చుకోవాలని సూచించారు. బిహార్‌కు కేంద్రం ఇచ్చిన రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీలో, 125 పక్కన ఎన్ని సున్నాలుంటాయో కూడా లాలూ కొడుకు తేజస్వికి తెలియదని ఎద్దేవా చేశారు. ఒకరినొకరు తిట్టుకున్న లాలూ-నితీశ్‌లు ఇప్పుడు అభివృద్ధికి వ్యతిరేకంగా ఒకటైతే వారికి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ‘యాదవులకు వ్యతిరేకంగా నితీశ్ లేఖ రాసినా ఇంకా లాలూ ఆయన వెనక నడుస్తున్నారు. లాలూ ఇంతలా అవమానిస్తున్నా.. యాదవులుగా ఉన్న మీకు రక్తం మరగటం లేదా?’అని యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్న పట్నాలో జరిగిన సభలో మోదీ అన్నారు. నితీశ్ చెప్పిన సాత్‌నిశ్చయ్ (ఏడు ప్రతిపాదనలు)కు ప్రతిగా బిహార్ అభివృద్ధికి ఆరు పాయింట్ల ఫార్ములాను మోదీ ప్రకటించారు.
మోదీ నిరంకుశవాది: నితీశ్
పట్నా: మహాకూటమి నేతలు రాష్ట్రాన్ని 18వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారన్న మోదీ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ ఘాటుగా స్పందించారు. ప్రధాని నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని.. బిహారీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పట్నా సభలో అన్నారు. అసత్యాలను అందంగా అబద్ధాలుగా మార్చి చెప్పటంలో మోదీ ఘనాపాటి అన్నారు. కాగా, గ్రూప్ సీ,డీతోపాటు గ్రూప్-బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను తొలగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించటం.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిచంనట్లేనని జేడీయూ నేత కేసీ త్యాగీ ఆరోపించారు.