
మరో 'భారీ' రికార్డు సృష్టించిన ఆమిర్ 'దంగల్'!
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన రెజ్లింగ్ డ్రామా 'దంగల్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆడబిడ్డల్లోని శక్తిని చాటి ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్‌లో 'దంగల్' రూ. 350 కోట్ల మార్క్‌ను దాటింది.
ఈ సినిమా మూడు వారాల్లో రూ. 345.30 కోట్లు వసూలు చేసింది. అయినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'దంగల్' కలెక్షన్ల జోరు తగ్గలేదు. గత వారాంతంలో శుక్రవారం రూ. 10.80 కోట్లు, శనివారం రూ. 14.33 కోట్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 345 కోట్లు సాధించిన ఈ సినిమా అంతర్జాతీయంగా మరో 180.58 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.
మరో కొత్త క్లబ్‌కు తెరతీసిన ఆమిర్..
'దంగల్' సినిమాతో మరో కొత్త క్లబ్బుకు ఆమిర్ ఖాన్ తెరతీశారు. అదే రూ. 350 కోట్ల క్లబ్బు. ఇప్పటివరకు వందకోట్ల క్లబ్బును 'గజనీ'తో, రెండువందల కోట్ల క్లబ్బును 'త్రీ ఇడియట్స్', రూ. 300 కోట్ల క్లబ్బును 'పీకే'తో మొట్టమొదట ప్రారంభించిన ఆమిర్ తాజాగా రూ. 350 కోట్ల క్లబ్బులోనూ మొదట తానే అడుగుపెట్టాడు. మరో విశేషమేమిటంటే గత ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా 'దంగల్', హాలీవుడ్ సినిమా 'ద జంగల్ బుక్' డిస్నీ ఇండియా నిర్మించినవే కావడం గమనార్హం. తన కూతుళ్లను అంతర్జాతీయ మెడళ్లను సాధించగలిగే రెజ్లింగ్ ధీశాలిలుగా తీర్చిదిద్దిన రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫోగాట్ జీవితచరిత్ర ఆధారంగా అత్యంత హృద్యంగా 'దంగల్' సినిమాను దర్శకుడు నితేష్ తీవారి తెరకెక్కించారు.