
ఆ హీరోకు వెయ్యికోట్ల బంపర్ ఆఫర్
తదుపరి జేమ్స్ బాండ్ ఎవరు అన్నదానిపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. దీనికోసం తెరవెనుక పెద్ద ఎత్తున చర్చలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తాజా జేమ్స్ బాండ్ సినిమా గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, తదుపరి జేమ్స్ బాండ్‌గా డానియెల్ క్రేగ్‌నే కొనసాగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏజెంట్ 007గా మరో రెండు సినిమాలు నటిస్తే ఏకంగా ఆయనకు 150 మిలియన్ డాలర్లు (రూ. 996 కోట్లు) ఇస్తామని చిత్ర నిర్మాతలు ఆఫర్ చేసినట్టు 'రాడర్ ఆన్‌లైన్' తెలిపింది.
బాండ్‌గా క్రెయిగ్‌ను ఒప్పించేందుకు నిర్మాత అయిన సోనీ సంస్థ తెరవెనుక చాలా ప్రయత్నాలే చేస్తున్నదని, అందులో భాగంగా కనీవినీ ఎరుగనిరీతిలో పారితోషికాన్ని ఆయనకు ఆఫర్ చేసిందని ఆ వెబ్‌సైట్ తెలిపింది. ఇప్పటికిప్పుడు బాండ్ పాత్రలో కొత్త వ్యక్తిని తీసుకోవడం సోనీకి ఇష్టం లేదని, తదుపరి రెండు సినిమాలకూ బాండ్‌గా క్రెయిగ్ ఉంటేనే బాగుంటుందని సోనీ టాప్ బాసులు భావిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా 'స్పెక్టర్' సినిమాతో 007గా క్రెయిగ్ అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాండ్ సిరీస్ సినిమాల్లో నటించబోనని ఆయన తేల్చిచెప్పారు. 'కావాలంటే నా మణికట్టు కోసుకోమన్న కోసుకుంటాను కానీ, బాండ్ పాత్రను మాత్రం చేయను. ఈ పాత్ర చేయడం వల్ల స్టంట్లతో నా ఒళ్లంతా హూనం అయిపోయింది' అని క్రెయిగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఆయనను మరోసారి 007గా చూపించేందుకు సోనీ, బాండ్ రూపకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి బాండ్‌గా మరోసారి క్రెయిగ్ తెరపై కనిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి.