పాక్ లో 'సూపర్ మామ్' గా సుష్మ
పాక్ లో 'సూపర్ మామ్' గా సుష్మ
Published Tue, Oct 4 2016 2:56 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
న్యూఢిల్లీ : యూఎన్ జనరల్ అసెంబ్లీలో కశ్మీరీ అంశంపై పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పాకిస్తాన్ బాలికలందరూ తన కూతుర్లేనని హృదయాన్ని హత్తుకునే ట్వీట్ చేశారు. 19 పాకిస్తానీ బాలికలను సురక్షితంగా వారి దేశానికి పంపించే బాధ్యత తనదేనని తెలిపారు. దీంతో సుష్మా స్వరాజ్ 'సూపర్ మామ్' గా వెలుగొందుతున్నారు. ఉడి ఘటన అనంతర పరిమాణాల నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్రమైన టెన్షన్ వాతావరణం నెలకొంది.
గతవారం నియంత్రణ రేఖ వెంబడి మొహరించి ఉన్న పాక్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడి చేయకముందు పాకిస్తాన్కు చెందిన 19మంది బాలికలు చండీఘడ్లో జరుగుతున్న యూత్ ఫెస్టివల్ కోసం భారత్కు వచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం వారి తిరుగుప్రయాణానికి కొంత ఆటంకం ఏర్పడింది. ఆ పిల్లల రక్షణపై కుటుంబసభ్యులు, ఆ దేశ ఈవెంట్ ఆర్గనైజర్స్ తీవ్ర ఆందోళన చెందారు. వారి పిల్లలను తమ దేశానికి త్వరగా పంపించాలని కోరారు. ఎవరికీ ఏ అపాయము వచ్చిన వెంటనే స్పందించే సుష్మాస్వరాజ్, ఆ పిల్లల తల్లిదండ్రులకు, ఆర్గనైజర్లకు భరోసా కల్పించే ట్వీట్ చేశారు.
కూతుర్లు అందరికీ కూతుర్లేనని, వారిని సురక్షితంగా పాకిస్తాన్కు పంపించే బాధ్యత తనదన్నారు. ఢిల్లీలో కూడా వారిని సురక్షితంగా ఉంచుతామని పేర్కొన్నారు. నేడు వారు సురక్షితంగా తిరుగుప్రయాణమయ్యారు. అధికారులు కూడా వారికోసం అదనపు భద్రత కల్పించారు. సుష్మాస్వరాజ్ ట్వీట్లపై ఆనందం వ్యక్తంచేసిన డెలిగేషన్ కన్వినర్ అలియా హరీర్ భారత్లో అతిథులను దేవుళ్లలాగా చూసుకుంటారని కృతజ్ఞతాపూర్వకమైన ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇంత టెన్షన్ వాతారణంలో జరిగిన మొదటి సందర్శన అని, ఇది వారికి ఓ జ్ఞాపకంలా నిలుస్తుందన్నారు. దీంతో సుష్మాస్వరాజ్ ఇటు భారత్లోనే కాక అటు పాకిస్తాన్లోనూ మన్ననలు పొందుతున్నారు.
Advertisement