నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలి
డీకోడ్ ఐటీ పార్క్ ప్రారంభసభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ఆదిబట్ల: యువత నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలని.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లాలని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 3వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా డీకోడ్ (డిజిటల్ ఇంజనీరింగ్ సెంటర్ ఫర్ ఆఫ్‌షోర్ అండ్ డొమెస్టిక్ ఎంటర్‌ప్రైజెస్) ఐటీ పార్క్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు కనుగొనడానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ డీకోడ్ ఐటీ పార్క్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్, మేడ్చల్‌లో సెల్‌కాన్, థామ్సన్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వివరించారు. జిల్లాలో 7 హార్డ్‌వేర్ పార్కులు ఏర్పాటవుతున్నాయని, గ్రామాల్లో 70 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు.
దేశంలో 125 కోట్ల జనాభా ఉన్నప్పటికీ.. విదేశీయులు కనుగొన్న వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను వాడుతున్నామని చెప్పారు. దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత కొత్త అంశాలను వెలికితీయాలని పిలుపునిచ్చారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలున్న రంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కిషన్‌కుమార్‌రెడ్డి, గురునానక్ కళాశాల చైర్మన్ కోహ్లీ, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల వెంకట్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.