ఢిల్లీకి చేరిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రచారం చేస్తూ తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఆరంభమైన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర బుధవారం ఢిల్లీకి చేరుకుంది. 10 జన్‌పథ్‌లో రాజీవ్ జ్యోతిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వీకరించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం రాజీవ్ సమాధి ఉన్న వీరభూమి వద్ద జ్యోతిని స్వీకరించి సమాధి వద్ద పెట్టనున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఇన్‌చార్జి చైర్మన్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ లేనిలోటు బాధాకరమన్నారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి, మతతత్వానికి వ్యతిరేకంగా, దేశ సమైక్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పుడు కొత్తగా గ్రామజ్యోతి అంటున్నారని, అయితే వాస్తవానికి ఆనాడే రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి గ్రామజ్యోతిని వెలిగించారని చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీల అధికారాలకు ఇబ్బందిలేకుండా గ్రామజ్యోతి జరగాలని ఆయన కోరారు.