ఉబర్ పై దావా ఉపసంహరణ
శాన్ ఫ్రాన్సిస్కో: ఉబర్ క్యాబ్ సంస్థపై న్యాయపోరాటం చేస్తున్న భారత మహిళ వెనక్కు తగ్గారు. ఉబర్ పై వేసిన దావాను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మంగవాళం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడి, దాడి చేశాడని గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అమెరికా కేంద్రంగా ఆన్ లైన్ లో కారు సేవలు అందిస్తున్న ఉబర్ పై ఈ ఏడాది జనవరిలో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఉబర్ విఫలమైందని ఆమె కోర్టు కెక్కారు. అయితే తమపై బురద చల్లేందుకే దావా వేశారని ఉబర్ వాదించింది. చివరకు ఆమె స్వచ్ఛందంగా దావా వెనక్కు తీసుకుంది. అయితే ఇరు వర్గాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరిందో వెల్లడి కాలేదు.
కాగా, అత్యాచారానికి పాల్పడిన ఉబర్ డ్రైవర్ ను గత డిసెంబర్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అతడు డ్రైవర్ గా చేరినట్టు గుర్తించారు.