తాగి రోడ్డుపై 'అంజలి' వీరంగం!
అమెరికాలో 30 ఏళ్ల మహిళా డాక్టర్ తాగి రోడ్డుపై వీరంగం సృష్టించింది. ఓ ఉబర్ డ్రైవర్‌పై దాడి చేసింది. ఓ వ్యక్తికి సంబంధించిన వస్తువులను రోడ్డుపై చెల్లాచెదురుగా పారేసింది. తాగి మత్తులో తూగుతూ ఆమె చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఆ వైద్యురాలిని వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేస్తూ అమెరికా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ అంజలి రాంకిస్సూన్ మియామిలో ప్రజావైద్యశాల అయిన జాక్సన్ హెల్త్ సిస్టంలో రెసిడెంట్ ఎంప్లాయిగా నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. ఆమె మంగళవారం మద్యం సేవించి ఆ మత్తులో ఈ వీరంగం సృష్టించినట్టు తెలుస్తోంది. ఆమె ముందస్తు రిజర్వేషన్ చేయించుకోకుండానే ఉబర్ క్యాబ్‌లో ఎక్కింది. ఆమె మద్యం సేవించి ఉండటాన్ని గమనించిన క్యాబ్ నుంచి దిగమని డ్రైవర్ అడిగాడు. దీంతో ఆమె రోడ్డు మీదనే శివాలెత్తింది.
ఉబర్ డ్రైవర్‌ను తన్నుతూ, పిడిగుద్దులు కురిపిస్తూ హల్‌చల్ చేసింది. ఆ తర్వాత క్యాబ్‌లోకి ఎక్కి అందులోని ఐఫోన్, టికెట్లు, కత్తెర తదితర వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడేసింది. అక్కడ ఉండి ఈ ఘటనను చూసిన జువాన్ సిన్కో అనే వ్యక్తి దీనిని చిత్రీకరించి యూట్యూబ్‌లో మంగళవారం అప్‌లోడ్ చేశాడు. దీనిపై గురువారం కథనాలు రావడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే 10వేల మంది ఈ వీడియోను చూశారు. ఉన్నతమైన వైద్యవృత్తిలో ఉండి ఇలాంటి చర్యకు పాల్పడటంతో అధికారులు ఆమెను క్లినికల్ సేవల నుంచి సస్పెండ్ చేశారు.