
రూ.2000 నోట్లు కూడా రద్దు కాకముందే..
న్యూఢిల్లీ: ‘పావుగంటలో తిరిగొస్తానని అమ్మకు చెప్పా. కానీ వచ్చాక తెలిసింది.. నేను కుంభమేళా లోకి ప్రవేశించానని. మా బ్యాంక్ ముందు క్యూ కట్టినవాళ్లలో సగం మందిని లెక్కించినా శ్రీలంక జనాభా కంటే ఎక్కువే తేలతారు. గంటకు అడుగైనా కదలని క్యూలైన్ లో రెండు రోజులు నిల్చుంటే ఎలా ఉంటుందో తెలుసా? అందుకే తమ్ముడికి ఫోన్ చేసి దుప్పటి తెమ్మన్నా. పనిలోపనిగా పొల్యూషన్ మాస్క్, నాలుగైదు కేజ్రీవాల్ కామెడీ వీడియోలూ, మ్యాగీ నూడుల్స్ పట్టుకురమ్మన్నా.
బహుశా డిసెంబర్ 30కిగానీ నేను బ్యాంక్ లోపలికి పోయి కొత్త నోట్లు తీసుకోలేనేమో. కొత్త నోట్లకు కూడా నకిలీవి తయారయ్యాయని జనం అనుకుంటున్నారు. ఏమో, రూ.2000 నోట్లు కూడా రద్దు చేసేలోపే వాటిని సాధించాలని అనుకుంటున్నా. క్యూలైన్లో ముందు నిల్చున్న ఒకరు భారంగా వెన్కి వచ్చేస్తుంటే అడిగా..‘ఏంది కొత్త నోట్లు అయిపోయాయా?’ అని కాదట, జియో సిమ్ కోసం కట్టిన లైన్ అనుకుని ఇందులో దూరాడట పాపం! రెండు రోజుల క్యూ అనుభవంతో నాకో విషయం బోధపడింది.. బ్యాంక్ ఉద్యోగులు లంచ్ టైమ్ ను 9AM-5PM నుంచి 1PM-2PMకు మార్చుకున్నారు. అయినాసరే క్యూ కదలట్లేదు’
ఇదీ ఢిల్లీ సగటు యువకుడు అమన్ ఆవేదన. దబ్రీ ప్రాంతానికి చెందిన అతను బుధవారం ఉదయం స్థానిక ఎస్బీఐకి వచ్చాడు. శనివారం నాటికి ఇంకా కొత్త నోట్లు దొరకలేదు. పలకరించిన మీడియాకు అమన్ తనదైన శైలిలో జవాబులు చెప్పాడు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇలాంటి అమన్ లే కనిపిస్తున్నారు. ఏమంటారు?