మంటలొచ్చాయని.. విమానం ఖాళీ
జమైకాలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానంలో కార్గో విభాగంలో మంటలు చెలరేగినట్లు అలారం రావడంతో.. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను, ఆరుగురు సిబ్బందిని ఆగమేఘాల మీద కిందకు దించేశారు. విమానాన్ని రన్వే మీదే వదిలేశారు. ఎయిర్పోర్టును కూడా కొద్దిసేపు మూసేశారు. మాంటెగో బే నుంచి అట్లాంటా వెళ్లాల్సిన ఈ బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకోడానికి కొద్ది సేపటి ముందు ఈ హడావుడి జరిగింది. అయితే, నిజానికి ఫ్లైట్ డెక్ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక సరైనది కాదని, అసలు ఎలాంటి మంటలు అందులో చెలరేగలేదని డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
అంతకుముందే ప్రయాణికులంతా హడావుడిగా విమానం నుంచి కిందకు దిగిపోయారు. దాంతో విమానాన్ని రన్వే మీదే వదిలేశారు. ఈ ఘటన తర్వాత జమైకా విమానాశ్రయాన్ని కూడా కొద్దిసేపు మూసి ఉంచాల్సి వచ్చింది. ఆ మార్గం మీదుగా వెళ్లాల్సిన విమానాలను కింగ్స్టన్ మీదుగా మళ్లించారు. కార్గో బే నుంచి అసలు మంటలు ఉన్నట్లు హెచ్చరికలు రావడానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.