జీతాలు నగదు రూపంలో చెల్లించండి!
పనాజి: పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో గోవాలోని ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా మేల్కొన్నారు. బ్యాంకులు నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఉన్న నిబంధనలు, ఏటీఎం కేంద్రాల్లో చాంతాండ క్యూల నేపథ్యంలో వారు ఆసక్తికరమైన డిమాండ్ కు దిగారు. నవంబర్ నెల జీతాన్ని తమకు నగదు రూపంలో అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత నెలలో తాము పడ్డ డబ్బు ఇబ్బందులతో బెంబేలెత్తిన గోవా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (జీజీఈఏ) ప్రభుత్వాన్ని ఈ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీజీఈఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కు ఒక లేఖ రాశారు.
రూ.500 ,రూ.1,000 నోట్ల రద్దును స్వాగతించిన జీజీఈఏ అధ్యక్షుడు జాన్ నజారేత్ ఈ ప్రగతిశీల అడుగులో ప్రభుత్వం విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని నవంబరు నెల జీతాన్ని ఈసీఎస్ పద్ధతిలో కాకుండా నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము ప్రజలకు సేవ చేయడానికి కార్యాలయాల్లో వెచ్చించే సమయాన్ని ఏటీఎం సెంటర్ల దగ్గర పడిగాపులు కాయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఆఫీసుల్లో ఉద్యోగులు లేకపోతే.. అంతిమంగా ప్రజల ఆగ్రహానికి, విమర్శలకు తావిస్తుందని ఆయన జోడించారు.