డీమానిటైజేషన్ పై దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
న్యూడిల్లీ: డీమానిటైజేషన్ పై దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్రపతి పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అయితే సుదీర్గ ఫలితాలు కోసం ఈ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ప్రణబ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ భేటీలో పాల్గొన్న ప్రణబ్.. డిమానిటైజేషన్ కారణంగా పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూడాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పేదరికం నిర్మూలనలో కోసం చేపట్టిన ఈ ప్రక్రియను ప్రశంసిస్తూనే..నోట్ల కష్టాలను సుదీర్ఘంకాలం భరించలేరని భావిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఇతర యంత్రాంగం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి అవసరం ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలనలో జాతికోసం జరుగుతున్న పయనంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘ ఫలితాలు సాధించాలంటే తాత్కాలికంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడక తప్పదని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.