
మేనల్లుడికి బుల్లెట్ తగిలిందని షూట్ చేసుకున్నాడు..
గోపేశ్వర్(ఉత్తరాఖండ్): వేటకెళ్లిన ఓ వ్యక్తి జంతువనుకొని కాల్పులు జరపగా దురదృష్టవశాత్తు తన మేనల్లుడికి బుల్లెట్ తగిలింది. తప్పుచేశానని మనస్తాపం చెంది తనను తానే కాల్చుకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన చమోలి జిల్లాలోని థరలి ప్రాంతంలో మారుమూల గ్రామమైన రుసన్‌లో చోటు చేసుకుంది.
శుక్రవారం సాయంత్రం గోవర్ధన్‌లాల్ అనే వ్యక్తి వేటకై అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల చాటున శబ్దం వినిపించడంతో జంతువు అనుకొని ఆ దిశగా కాల్పులు జరిపాడు. తీరా దగ్గరికెళ్లి చూసి నిర్ఘాంతపోయాడు. తన సొంత మేనల్లుడు దర్శన్‌లాల్‌కు బుల్లెట్ తగిలి పడి ఉండటాన్ని గమనించాడు.
తీవ్ర మనస్తాపం చెందిన గోవర్ధన్.. తనకు తానే కాల్చుకొని దుర్మరణం చెందాడని థరలి ఎస్డీఎం అనూప్ నౌతియాల్ తెలిపారు. అతని మేనల్లుడు దర్శన్‌లాల్ కర్ణప్రయాగ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయనకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు వివరించారు.