
ఇన్ఫోసిస్ లో ముదురుతున్న విభేదాలు?
ముంబై:డీమానిటైజేషన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడ్డ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా ఇంటిపోరును ఎదుర్కొంటోంది. ముఖ‍్యంగా ఇన్ఫీ వ్యవస్థాపకులకు, సీఈవో విశాల్ సిక్కాకు తీవ్ర విభేదాలు పొడసూపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల భారీగా పెరిగిన సీఈవో వేతనంపై (సం.రానికి రూ.49కోట్లు) వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. గత రెండేళ్లుగా సంస్థలో పారదర్శకత లోపించిందని, సంస్థను వీడిన ఉద్యోగులకు చెల్లించిన భారీ ప్యాకేజీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే సంస్థలో అంతర్గతంగా ఉడుకుతున్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు టాటా- మిస్త్రీ బోర్డు వివాదం ఇంకా సద్దుమణగముందే ఇన్ఫోసిస్ లో మరో సంక్షోభం తలెత్తనుందా అనే సందేహాలు మార్కెట్ వర్గాల్లో కలవరం పుట్టిస్తున్నాయి.
దేశంలోనే రెండవ అతి పెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు సంస్థలో పారదర్శకత మరియు కార్పొరేట్ పాలనపై ఆందోళనలు వ్యక్తం చేశారు. మాజీ కంప్లయిన్స్ చీఫ్ ఆఫీసర్ డేవిడ్ కెన్నెడీ రాజీనామా ప్యాకేజీ, విశాల్ ప్యాకేజీలపై కూడా వారు అనేక ప్రశ్నలనులేవనెత్తుతున్నారు. సంస్థ కార్పొరేట్ గవర్ననెన్స్ ఉన్నత ప్రమాణాలు క్రమంగా క్షీణిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి జయంత్ సిన్హా భార్య పునీత సిన్హను ఇండిపెండెంట్ డైరెక‍్టర్ గా నియామకం, మాజీ సీఎఫ్‌వో సీఈవో రాజీవ్ బన్సల్ అందించిన ప్యాకేజీపై (రూ.17.4కోట్లు)తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) అంశాన్ని పరిశీలించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీవద్ద రూ. 38,000 కోట్ల విలువైన నగదు నిల్వలున్నాయి. వీటి నుంచి బైబ్యాక్‌కు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది.