
వందకోట్లకు గురిపెట్టిన టాలీవుడ్ నిర్మాత!
కొత్త సంవత్సరంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వందకోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ టార్గెట్‌ను అందుకోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా పలు చిన్నా, పెద్ద ప్రాజెక్టులను ఆయన ప్రకటించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆయన తదుపరి ప్రాజెక్టు చిన్న సినిమా శతమానం భవతి. సంక్రాంతి పండుగ బరిలోకి దూకేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. కాగా, ఆయన చేపట్టిన పెద్ద ప్రాజెక్టు దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మేలో విడుదల కానుంది. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఫిదా'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఇక నాచురల్ స్టార్ నానితో దిల్ రాజు నిర్మిస్తున్న 'నేను లోకల్' సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో క్రెజీ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. మణిరత్నం రూపొందించిన 'డ్యుయెట్' సినిమా తెలుగు హక్కులను కూడా ఆయన కొనుగోలు చేశారు. మరికొన్ని ఇతర సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాలుగు సినిమాల ద్వారా నిర్మాతకు రూ. 70 కోట్ల వరకు ఆర్జించే అవకాశముందని, మరో రూ. 30 నుంచి రూ. 40 కోట్ల వరకు ఆర్జించాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'డెక్కన్ క్రానికల్' తెలిపింది.