
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.

సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్‌కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్‌జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.
ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment