తమ రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రధాని మోదీతో చర్చించినట్టు మెహబూబా ముఫ్తీ తెలిపారు.
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగ్గిన పోలింగ్, తమ రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. మోదీతో భేటీ ముగిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రధాని చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అడుగుజాడల్లో నడుస్తానని ఆయన పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జలవనరులపై తమ రాష్ట్రానికి నియంత్రణ లేకపోవడంతో సింధు నదీజలాలు ఏవిధంగా కోల్పోతున్నామో ప్రధానికి వివరించినట్టు చెప్పారు. కొంత మంది కశ్మీరీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారని, మరి కొందరిని పురిగొల్పుతున్నారని ఆరోపించారు. యువత పెడదారి పట్టకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. కాగా, కశ్మీర్ లోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికలో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలైన సంగతి తెలిసిందే.