ఆ అస్థికలు షీనావే.. చిక్కుల్లో ఇంద్రాణి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. షీనా బోరా హత్యకు గురైనట్టు నిర్ధారణైంది. రాయగఢ్ అడవుల్లో పోలీసులు సేకరించిన అస్థికలు షీనా బోరావేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నమూనాలు ఇంద్రాణి డీఎన్ఏతో సరిపోలినట్టు పరీక్షల్లో రుజువైందని సమాచారం.
ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇటీవల నిందితులను సంఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి అస్థికలు, పుర్రెను సేకరించారు. పరీక్షల్లో ఈ అస్థికలు షీనా బోరావేనని తేలింది.
ఈ రోజు ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ రాయ్లను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు.