డాక్టర్లకు గోల్డ్ కాయిన్లు ఇచ్చి..!
డాక్టర్లకు గోల్డ్ కాయిన్లు ఇచ్చి..!
Published Sat, Jan 21 2017 1:50 PM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోడానికి ఫార్మా కంపెనీలు వైద్యులకు బహుమతులు, లంచాలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇటీవల బెంగళూరులో పిల్లల వైద్యుల వార్షిక సదస్సు ఒకటి జరిగింది. దానికి ఒక కంపెనీ సంక్రాంతి కానుక అని చెప్పి.. డిజిటల్ వేయింగ్ స్కేల్స్, బంగారు కాయిన్లు, స్టెతస్కోప్ తదితరాలను బహుమతులుగా ఇచ్చింది. వాటితో పాటే.. తమ సంస్థ ఉత్పత్తి చేసే థైరాయిడ్ మందులు, రోటా వైరస్‌లకు భారీ ఆర్డర్లు సంపాదించుకుంది. కానీ, వాక్సిన్ల కోసం డాక్టర్లకు లంచాలిచ్చారడాన్ని సదస్సు నిర్వాహకులు ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, వాక్సిన్ల కోసం బహుమతులు ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఎవరైనా వాక్సిన్లు భారీమొత్తంలో కొంటే వాళ్లకు మొత్తం ధరలో కొంత కన్సెషన్లు లభిస్తాయని డాక్టర్ కరుణాకర చెప్పారు. తాను 18 ఏళ్లుగా పిల్లల వైద్యుడిగా ఉన్నానని, ఇప్పటివరకు డాక్టర్లకు ఎలాంటి ఇన్సెంటివ్‌లు ఎవరూ ఇవ్వలేదని ఆయన చెప్పారు.
ఫార్మా కంపెనీలు వైద్యులకు ఉచిత బహుమతులు ఇవ్వడాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిషేధించింది. కానీ, సంక్రాంతి కానుకలు ఇవ్వకూడదన్న నిబంధన లేకపోవడంతో దాన్ని సదరు సంస్థ క్యాష్ చేసుకుంది. ఒక గోల్డ్ కాయిన్ తీసుకున్నందుకు ఒక్కో డాక్టర్ 150 చొప్పున థైరాయిడ్, రోటావైరస్ వ్యాక్సిన్లు ఆర్డర్ చేయాల్సి వచ్చింది.
2016లో నిర్వహించిన సదస్సులో కూడా ఇలాగే జరిగింది కానీ, అప్పట్లో ఆ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఒక ఫార్మా కంపెనీ బ్యానర్ పెట్టుకుంది. ఇవే తరహా వ్యాక్సిన్లు 50 చొప్పున ఆర్డర్ చేసినందుకు ఒక్కో డాక్టర్‌కు ముత్యాల సెట్లు ఇచ్చారు. వాటితో పాటు 200 వ్యాక్సిన్లు ఆర్డర్ చేసినవారికి ఐఫోన్ 5ఎస్‌లు కూడా ఇచ్చారు.
Advertisement