రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్ అధికార ప్రతినిధి హోప్ హిక్స్. ట్రంప్ ప్రచారకార్యక్రమాల దగ్గర్నుంచి విధానాల ప్రకటనల వరకు అన్ని వ్యవహారాలు ఈవిడే చూసుకుంటారు.
బల్మెడి: ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై కాస్త వెనక్కి తగ్గారు రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్. అందరు కాదూ.. ఉగ్రవాద ప్రభావిత దేశాల నుంచి వచ్చే ముస్లింలపై మాత్రమే నిషేధం విధించాలని తాజాగా స్వరం మార్చారు. స్కాట్ లాండ్ తీరంలోని బల్మెడిలో గల గోల్ఫ్ కోర్సులో సేదతీరుతోన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద రహిత దేశాల నుంచి అమెరికాకు వచ్చే ముస్లింలతో తనకెలాంటి సమస్యలేదని అన్నారు.
'జనవరిలో జరిగిన ఓ ప్రచార సభలో ట్రంప్ తన విధానాలు తెలియజేస్తూ అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకోవాలని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి ఆ వ్యాఖ్యల వెనకున్న అర్థం వేరు. తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ముస్లింలతోనే అమెరికాకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ ఉద్దేశం. ఆ దేశాలు ఎంత ప్రమాదకరంగా మారాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టే అక్కడివారిని రానివ్వద్దని ఆయన చెప్పారు' అంటూ డోనాల్డ్ ట్రంప్ అధికార ప్రతినిధి హోప్ హిక్స్ ఈమెయిల్స్ ద్వారా మీడియాకు వివరణ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష స్థానంకోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం జులైలో ఖరారు కానుంది. రిపబ్లికన్ పార్టీ నేతల్లో చాలామంది ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.