ట్రంప్ కలువబోయే మొదటి విదేశీ నేత ఎవరు!
లండన్: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటగా కలువబోయే విదేశీ నేత బ్రిటన్ అధినాయకురాలు థెరిసా మే కానున్నారు. బ్రిటన్ ప్రధాని థెరిసా వచ్చేవారం వాషింగ్టన్‌లో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె ట్రంప్‌తో భేటీ అవుతారని, అగ్రరాజ్య పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ కలిసే మొదటి విదేశీ అధినేత ఆమెనని 'ద డెయిలీ టెలిగ్రాఫ్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
థెరిసా మే రెండురోజులపాటు అమెరికాలో పర్యటించే అవకాశముందని, అధికారిక ఓవల్ కార్యాలయంలో కొత్త అధ్యక్షుడితో ఆమె చర్చలు నిర్వహించనున్నారని పేర్కొంది. ట్రంప్ ప్రధాన వ్యూహకర్త స్టీవ్ బానన్ విజ్ఞప్తి మేరకు థెరిసా పర్యటన ఖరారైందని, ఆమె పర్యటనను కాస్తా ముందుకు జరపాలని ఆయన విజ్ఞప్తి చేయడంతో గుట్టుగా ఈ పర్యటనకు సంబంధించిన సకల సన్నాహాలను అధికారులు పూర్తి చేశారని ఆ పత్రిక చెప్పుకొచ్చింది.