ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు : ట్రంప్
ఎలాంటి బిజినెస్ డీల్స్ ఉండవు : ట్రంప్
Published Tue, Dec 13 2016 1:08 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపారాలన్నింటిన్నీ వదిలివేస్తానని సంచలన నిర్ణయం ప్రకటించిన అనంతరం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో తాను వైట్హోస్లో ఉన్నంత వరకు తన వ్యాపారాలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోవని ప్రకటించారు. అయితే వటవృక్షంలో విస్తరించి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లను ఎలా నిర్వహించబోతున్నారో అనే దానికి మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ను వాయిదా వేసిన అనంతరం సోమవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. వాయిదా వేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వివాదాలు తనకు చుట్టుముట్టుకోకుండా ఉండేందుకు తీసుకోబోయే ప్లాన్స్ను వివరిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆ కాన్ఫరెన్స్ను ట్రంప్ వాయిదావేశారు.
సమాచార ప్రసార సాధనంగా ఆయన ఎక్కువగా వాడే ట్విట్టర్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. తను అధ్యక్ష పదవి చేపట్టే ముందు వ్యాపారాలన్నింటిన్నీ తన కొడుకులు డాన్, ఎరిక్లకు అప్పజెప్పుతానని ప్రకటించారు. టాప్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీలను నడిపిస్తారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ తన వైట్హోస్లో ఉన్నప్పుడు ఎలాంటి కొత్త డీల్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడిగా ఉన్నంతమాత్రానా వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి చట్టాలు లేకపోయినా.. తాను మాత్రం పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఉండటానికే కృషిచేస్తానని వాగ్దానం చేశారు. బ్యాంకు రుణాలు, లీజులు వంటి డీల్స్ అవసరమయ్యే తన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎన్ఎన్ అనాలిసిస్ ప్రకారం ట్రంప్ మొత్తం 500 కంపెనీలను కలిగి ఉన్నారు. వాటిలో 150 కంపెనీలు టర్కీ, ఖత్తర్, సౌదీ అరేబియా వంటి కనీసం 25 విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
Advertisement