
ఆందోళన వ్యక్తం చేసిన రజనీకాంత్
చిత్ర పరిశ్రమపై డబుల్ ట్యాక్స్ వద్దంటూ విజ్ఞప్తి
చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమపై డబుల్ పన్నులు విధించాలన్న తమిళనాడు సర్కారు నిర్ణయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమపై 28శాతం జీఎస్టీతోపాటు 30శాతం వినోదపన్ను విధించాలన్న పళనిస్వామి సర్కారు నిర్ణయంతో ఇండస్ట్రీపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధి కోల్పోయే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. 'తమిళ చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది ఉపాధిని దృష్టిలో పెట్టుకొని తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలి' అని రజనీ మంగళవారం ట్వీట్ చేశారు.
జీఎస్టీ అమలు నేపథ్యంలో వినోదపన్ను కూడా కొనసాగించాల్న తమిళనాడు సర్కారు నిర్ణయం చిత్రపరిశ్రమకు శరాఘాతంగా మారింది. దీంతో తమిళనాడు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం, మంగళవారం థియేటర్లన్నింటినీ మూసివేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. బుధవారం కూడా తమిళనాడులోని థియేటర్లు బంద్ పాటించనున్నాయి. ఇప్పటికే తమిళ సర్కారు నిర్ణయం కమల్‌హాసన్ సహా తమిళ హీరోలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.