ఇది ‘డ్రగ్స్’ రాజధాని
⇒మాదకద్రవ్యాలకు అడ్డాగా హైదరాబాద్
⇒ ఏటా రూ. 150 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ స్మగ్లింగ్
⇒ దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి రవాణా
⇒ ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలింపు
⇒ సినీనటుల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లల దాకా వీటికి బానిసలే
⇒ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించిన స్మగ్లర్లు
⇒ ఉన్నతస్థాయి ఒత్తిడులతో దర్యాప్తు చేయలేని స్థితిలో ఖాకీలు
⇒ అక్రమ రవాణాకు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న డ్రగ్స్ డీలర్లు
⇒ పేదరికంలో మగ్గుతున్న యువతకు గాలం వేసి స్మగ్లింగ్
⇒ఇటీవలే పొట్టలో కొకైన్‌ను తరలిస్తూ పట్టుబడిన మూసా
యువత ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి.
యువత ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి కూడా. ఇటీవలే దక్షిణ అమెరికా నుంచి హైదరాబాద్‌కు పొట్టలో కొకైన్ ప్యాకెట్లను పెట్టుకుని స్మగుల్ చేస్తూ మూసా అనే మహిళ పట్టుబడిన విషయం తెలిసిందే. మూసా దొరికింది కాబట్టి ఈ విషయం అందరికీ వెల్లడైంది. బయటకు తెలియకుండానే హైదరాబాద్ మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఏటా దాదాపు 50 మంది స్మగ్లర్లు (మాదకద్రవ్యాల రవాణాలో ఆరితేరిన వారు) దక్షిణ అమెరికా దేశాల నుంచి వివిధ పద్ధతుల్లో కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.
కానీ అతి తక్కువ సందర్భాల్లో ఒకరిద్దరు పోలీసులకు పట్టుబడుతున్నారు. ‘కొకైన్‌తో వచ్చి చిక్కిన మూసా ఇలాంటి స్మగ్లింగ్‌కు కొత్త. అందువల్లే అనుమానాస్పద రీతిలో ఆమె పోలీసులకు సులువుగా పట్టుబడింది’ అని ఓ అధికారి చెప్పారు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ నలుగురు విదేశీయులు పట్టుబడ్డారు. అసలు ‘ఒకసారి వచ్చిన స్మగ్లర్ ఐదేళ్లదాకా మళ్లీ అదే మార్గంలో ప్రయాణించడు. తరచూ ప్రయాణం చేస్తే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో కొకైన్, హెరాయిన్ డీలర్లు కొత్తవారికి శిక్షణ ఇచ్చి పంపుతుంటారు. ఒక్కో స్మగ్లర్ తనకు కేటాయించిన అసైన్‌మెంట్ పూర్తిచేస్తే రవాణా చేసిన మాదకద్రవ్యం విలువలో 15 శాతం ఇస్తారు. అంటే కోటి రూపాయల విలువైన కొకైన్‌ను తెస్తే స్మగ్లర్‌కు 15 లక్షలు ఇస్తారు. కారణం ఏమిటో తెలియదు గానీ మాదకద్రవ్యాల డీలర్లు హైదరాబాద్‌ను హబ్‌గా ఎంపిక చేసుకుంటున్నారు..’’ అని ఈ నేరాలపై దర్యాప్తు చేసే ఓ సీనియర్ అధికారి వివరించారు.
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి
వందల కోట్లలో..
ఏటా రూ.150 కోట్ల విలువైన కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు నగరానికి రవాణా అవుతున్నాయని నార్కోటిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. దక్షిణ అమెరికా లేదా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉంటుండడంతో... స్మగ్లర్లు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల నుంచి ప్రయాణిస్తున్నట్లుగా మాదకద్రవ్యాల డీలర్లు డాక్యుమెంట్లు చూపుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశస్తులు కూడా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పాస్‌పోర్టులు సంపాదించి వీటిని రవాణా చేస్తున్నట్లు ముంబై కేంద్రంగా సుదీర్ఘకాలం పనిచేసిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వస్తున్నట్లు అంచనా వేస్తున్న మాదక ద్రవ్యాల్లో మూడోవంతు సముద్ర మార్గం ద్వారా వస్తోందన్నారు.
అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన అంశాలను నార్కోటిక్ విభాగం రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని.. పోలీసులు లోతుగా విచారణ జరపకపోవడం డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడానికి తోడ్పడుతోందని చెప్పారు. చివరకు సినిమా చిత్రీకరణలోనూ వినియోగించేదాకా వెళ్లిందని ఆయన వెల్లడించారు. ‘‘నాలుగేళ్ల క్రితం ముంబైలోని బాంద్రాలో ఓ సినిమా చిత్రీకరణ జరిగే ప్రదేశంలో రూ.10 లక్షల విలువైన కొకైన్ లభించింది. సినిమా చిత్రీకరణ సమయంలో నటీనటులకు మరింత ఉత్తేజాన్ని నింపేందుకు దీనిని వాడినట్లు ఆ తరువాత ఆరు మాసాలకు తెలిసింది..’’ అని ఆ అధికారి వెల్లడించారు.
హైదరాబాద్‌కే ఎందుకు?
కొకైన్ వాడుతూ, కొకైన్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయిన కేసులు నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందిన సంపన్న కుటుంబాల వారు హైదరాబాద్ శివార్లలో ‘రేవ్’పార్టీలు నిర్వహించుకుంటున్నారంటేనే ఇక్కడ డ్రగ్స్ ఎంత సులభంగా దొరుకుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు వస్తున్న మాదకద్రవ్యాలను వరంగల్, విశాఖపట్నం తో పాటు తమిళనాడు, గోవాలకు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఔరంగాబాద్, షోలాపూర్‌కు రవాణా చేస్తున్నారు. ఇందుకోసం 75% నైజీరియన్లు, 25% స్థానికులను వినియోగించుకుంటున్నారు. ముంబై నుంచి గోవాకు తరలింపులో ఇబ్బందుల కారణంగా స్మగ్లర్లు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు.
డబ్బు ఆశ చూపి..
‘‘నువ్వు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని వారంలో సంపాదించే మార్గం చెపుతా. నేను అప్పగించిన అసైన్‌మెంట్ వారంలో పూర్తిచేస్తే నీకు పాతికవేల డాలర్లు (సుమారు రూ.16లక్షలు) ఇస్తా. నీకు ఇంగ్లిషు తెలుసు కాబట్టి విమానాశ్రయాల్లో అధికారులకు తెలివిగా సమాధానం చెప్పగలవు. దానికి నువ్వు సిద్ధమేనా...’’ ఓ డ్రగ్స్ డీలర్ చెప్పిన ఈ మాటలకు దక్షిణ అమెరికాకు చెందిన మూసా లొంగిపోయింది. ప్రాణాలకు తెగించి తన పొట్ట కింది భాగంలో కోటి రూపాయల విలువైన 56 కొకైన్ ప్యాకెట్లతో పయనమై.. హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడింది. ఆమె చెప్పిన సమాచారం ఆధారంగా కొలంబియాలో ఓ మాదకద్రవ్యాల డీలర్‌గా నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే తరహాలో మాదకద్రవ్యాల డీలర్లు పేదలకు వల వేసి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయిస్తున్నారు.
సినీ పరిశ్రమలో..
మూడేళ్ల కింద ఓ సినీహీరో సోదరులకు, మరో సినీనటుడికి కొకైన్ అందజేస్తుండగా ఇద్దరు నైజీరియన్లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరెవరికి కొకైన్, హెరాయిన్ సరఫరా చేస్తున్నదీ చెప్పారు. అంతేగాకుండా వారి డైరీ ఆధారంగా డ్రగ్స్ వినియోగదారులను గుర్తిం చారు. అందులో సినీరంగానికి చెందిన అనేక మందితో పాటు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల కుటంంబ సభ్యులు ఉన్నారు. ఉన్నతస్థాయిలో ఒత్తిడులు రావడంతో వారెవరినీ పోలీసులు విచారించలేదు, కనీసం కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నమూ చేయలేదు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు చాలా ఉన్నా అడపాదడపా మాత్రమే పోలీసులకు చిక్కుతున్నాయి. కానీ రాజకీయ ఒత్తిడుల కారణంగా పోలీసులు ఆ కేసులను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు.
తెలుగు సినిమాకూ అంటిన ‘కొకైన్’..
పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అద్భుతమైన సీన్లు పండించేందుకు డ్రగ్స్ వినియోగించినట్లు తెలిసింది. చిత్రీకరణ పూర్తయిన తరువాత ఆ క్యారెక్టర్ పోషించిన వారికి కూడా తాము ఆ విధంగా నటించి ఉంటామని అనుకోరు. నాలుగేళ్ల క్రితం ముంబైలోని బాంద్రాలో ఓ హిందీ సినిమా చిత్రీకరణ సమయంలో అక్కడి పోలీసులు కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మళ్లీ దాదాపు ఏడాది కింద హైదరాబాద్ నగర శివార్లలో ఓ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు మాదకద్రవ్యాలు వినియోగించినట్లు వెల్లడైంది. విదేశాల నుంచి భారత్‌కు మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌లో ప్రధానపాత్ర పోషించిన ఓ నైజీరియన్‌ను ముంబై పోలీసులు విచారించినప్పుడు ఈ సంగతి బయటపడింది. సినిమా నిర్మాణం, చిత్రీకరణ జరిగిన ప్రదేశం వంటి వివరాలను కూడా వారు తెలుసుకోగలిగారు. కానీ ఆ సినిమా చిత్రీకరణ జరిగిన స్థలయజమానికి ఉన్నతస్థాయిలో ఉన్న పలుకుబడి దృష్ట్యా పోలీసులు విచారణ జరిపే సాహసం చేయలేదు.
అంతా పెద్ద పెద్ద వాళ్లే..
ఏడాది కింద హైదరాబాద్‌లో కొకైన్‌తో ఓ నైజీరియన్ పట్టుబడ్డాడు. ఓ అజ్ఞాత వ్యక్తికి కొకైన్ అందజేయడం ఏజెంట్ అతనికి నిర్దేశించిన పని. పని పూర్తయ్యాక రూ.50 వేలు ఇస్తామనేది ఒప్పందం. అయితే ఏజెంట్ ఇచ్చిన కవర్‌లో ఏముందో తనకు తెలియదని ఆ నైజీరియన్ చెప్పాడు. కవర్ అందజేసిన వ్యక్తి వివరాలు గానీ, ఆ కొకైన్‌ను ఎవరికి అప్పగించాలోగానీ అతనికి తెలియదు. అసలు నిందితులను గుర్తించడానికి నైజీరియన్ కాల్‌డేటా తెప్పించిన పోలీసులు... అందులో ఉన్న నంబర్లు చూసి ఆశ్యర్యపోయారు. ఓ ప్రముఖ సినీ నిర్మాత కుటుంబానికి చెందిన వ్యక్తి... సినిమా రంగానికే చెందిన మరో వ్యక్తికి కొకైన్ అందజేయాల్సిందిగా ఈ నైజీరియన్‌ను పురమాయించారు. అయితే కాల్‌డేటాతో పరువు కలిగిన కుటుంబాల జోలికి వెళ్లవద్దంటూ ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిడుల కారణంగా పోలీసులు అటువైపు దృష్టి సారించలేదు.